పెద్దపల్లి, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద జరిగిన గొడవ ఓ యువకుడి అతని ప్రాణం మీదికి తెచ్చింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి తండ్రి మంచిర్యాల జిల్లా జైపూర్‌లో పనిచేసే హోంగార్డు శీలం దేవేందర్ కథనం ప్రకారం.. మంథని పట్టణంలోని శ్రీపాదకాలనీకి చెందిన శీలం రాజ్‌కుమార్ ఈ నెల 7న తన ఇంటి నుంచి మంథని వైపు వెళ్తున్నాడు. ఆ క్రమంలో స్థానికంగా ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో పని చేస్తున్న కొంత మంది హమాలీలు రాజ్‌కుమార్‌ను పిలిచారు. వారి మధ్య జరిగిన సంభాషణ గొడవకు దారి తీసింది. ఘర్షణ జరిగింది.
హమాలీలు వెళ్లి రాజ్‌కుమార్‌పై మంథని ఠాణాలో ఫిర్యాదు చేయగా, పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఠాణాకు తరలించి, రాత్రి వరకు అక్కడే ఉంచుకున్నారు. విషయం తెలుసుకున్న రాజ్‌కుమార్ తండ్రి దేవేందర్ స్టేషన్‌కు చేరుకొని, తన కొడుకును ఎందుకు అరెస్టు చేశారని, ఏదైనా జరిగితే కేసు పెట్టాలి కానీ ఇలా దాడి చేయడం ఏంటని నిలదీశాడు. తన కొడుకుపైనే హమాలీలు దాడి చేశారని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కొడుకును బయటికి పంపాలని కోరగా, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడంతోపాటు కొట్టిన విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని పోలీసులు బెదిరించారని ఆయన ఆరోపించాడు.
అదే రోజు రాత్రి ఇంటికి వచ్చిన రాజ్‌కుమార్, మనస్తాపంతో ఆదివారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి, అపస్మారక స్థితిలో ఉన్న రాజ్‌కుమార్‌ను మంథని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లగా, ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. కోమాలో ఉన్న కొడుకు పరిస్థితిని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కాగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్న రాజ్‌కుమార్ వీపు, తోడలు, కాళ్లపై లాఠీ దెబ్బలకు సంబంధించిన తీవ్ర గాయాలు ఉన్నాయని, దీనికి తోడు ఫ్యాన్‌కు ఉరేసుకొని వేలాడడంతో మెడ నరాలు దెబ్బతిన్నాయని ఆందోళన చెందుతున్నారు.
నా కొడుకు ఏదైనా తప్పు చేస్తే కేసు పెట్టాలి. ఆ తర్వాత కోర్టు ఏదైనా శిక్ష విధిస్తే భరిస్తాం. కానీ, విచక్షణారహితంగా దాడి చేశారు. స్వయంగా ఎస్ఐ కొట్టాడని నా కొడుకు చెప్పిండు. ఒంటిపై దెబ్బలు చూపిస్తూ తీవ్ర మనస్తాపం చెందిండు. నేను వెళ్లి ఎస్ఐ, పోలీస్ సిబ్బందిని నిలదీస్తే కొట్టలేదని అంటున్నారు. కానీ, నా కొడుకు అవమానం భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డడు. నా కొడుకుకు ఈ పరిస్థితికి రావడానికి మంథని ఎస్ఐ రమేశే కారణం. దీనిపై సమగ్ర విచారణ జరిపించి ఎస్ఐ, ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి.
– దేవేందర్, రాజ్‌కుమార్ తండ్రి
శ్రీపాదకాలనీలో గొడవ జరుగుతున్నట్టు సమాచారం వస్తే పోలీసు సిబ్బంది వెళ్లారు. రాజ్‌కుమార్‌తో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకొని వచ్చారు. రాజ్‌కుమార్ మద్యం మత్తులో ఉన్నాడు. మరుసటి రోజు సైతం ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి హమాలీలతో ఘర్షణకు దిగాడు. హమాలీలు వచ్చి రాజ్‌కుమార్‌పై ఫిర్యాదు చేస్తే, కేసు నమోదు చేశాం. ఆ తర్వాత మధ్యాహ్నం తిరిగి రాజ్‌కుమార్ హమాలీలతో మళ్లీ గొడవ పడ్డట్లు తెలిసింది. సాయంత్రం ఇంటిలో ఏమైందో ఏమో..? రాజ్‌కుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాజ్‌కుమార్‌పై మేం ఎలాంటి దాడి చేయలేదు.
– రమేశ్, మంథని ఎస్ఐ