ACB Raids | మంథని, ఫిబ్రవరి 20 : భూమి రిజిస్ట్రేషన్ కోసం లంఛం డిమాండ్ చేసిన సబ్ రిజిస్ట్రార్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్న సంఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలోచోటు చేసుకుంది. కరీంనగర్ ఏసీబీ ఇన్చార్జి డీఎస్పీ మధు కథనం ప్రకారం.. మంథని మండలం పుట్టపాక గ్రామంలో 300 చదరపు గజాల భూమి రిజిస్ట్రేషన్ కోసం ఓ వ్యక్తి రిజిస్ట్రార్ కార్యాలయంలో సంప్రదించారు. ఈ నేపథ్యంలో డాకుమెంట్ రైటర్‌గా ఉన్న రషీద్‌తో కలిసి సబ్ రిజిస్ట్రార్ పసర్ల రాజేందర్ రూ.35వేల లంఛం డిమాండ్ చేశాడు.
తన ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రార్ రూ.35వేల లంచం డిమాండ్ చేయడంతో పాటు మొదటి విడుతగా రూ.16500 చెల్లించాలని సూచించారు. దీంతో సదురు వ్యక్తి చేసేది ఏమీ లేక కరీంనగర్ ఏసీబీ అధికారులను సంప్రదించారు. వ్యక్తి ముందుగానే ఏసీబీ అధికారులకు సమాచారమివ్వడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఏసీబీ అధికారులు కాపు కాశారు. సదురు వ్యక్తి డాక్యుమెంట్ రైటర్ రషీద్ ద్వారా సబ్ రిజిస్ట్రార్ పసర్ల రాజేందర్‌కు రూ.16500 లంఛం ఇస్తుండటంతో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
లంఛం డిమాండ్ చేసి తీసుకున్న సబ్ రిజిస్ట్రార్ పసర్ల రాజేందర్, సహకరించిన డాక్యుమెంట్ రైటర్ రషీద్‌ను విచారించడంతో పాటు పట్టుకున్న రూ.16500నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరినీ కరీంనగర్ కోర్టు ఎదుట ప్రవేశ పెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మధు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే అధికారులు, సిబ్బంది ఎవరైనా లంఛం డిమాండ్ చేస్తే వెంటనే తమ దృష్టికి తీసుకు వస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏసీబీ అధికారులను 1064 నెంబర్లో లేదా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ 9154388954లో సంప్రదించాలని ఆయన సూచించారు.