మహదేవపూర్, అక్టోబర్ 26: ‘కాంగ్రెస్‌కు ఓటేస్తే రాష్ట్రంలో కటిక చీకట్లు నిండుతాయి..ఆ పార్టీ ఆరు గ్యారెంటీలను నమ్మితే అధోగతి పాలు కావడం ఖాయం’ అని పెద్దపల్లి జడ్పీ చైర్మన్, మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ హెచ్చరించారు. పదేండ్ల పాలనలో అన్ని వర్గాలకు మేలు చేసిన సీఎం కేసీఆర్ సర్కారును ఆశీర్వదించాలని కోరారు. గురువారం మహదేవపూర్‌లో మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నిండా ముంచింది కాంగ్రెస్సేనని మండిపడ్డారు.
ఇప్పుడు అక్కడ కరెంట్‌లేక సబ్స్టేషన్లలో మొసళ్లు తోలే దుస్థితి దాపురించిందన్నారు. ప్రజలు ఆ పార్టీ మోసపూరిత వాగ్దానాలను విశ్వసించవద్దని విజ్ఞప్తిచేశారు. 40 ఏండ్లు మంథని నుంచి ప్రాతినిధ్యం వహించిన శ్రీధర్‌బాబు కుటుంబం ఈ ప్రాంత ప్రజలకు చేసిందేమీలేదని ఆరోపించారు. ఆయన ప్రజల కష్టాలను గాలికి వదిలి పట్నంలో ఉంటున్నాడని దుయ్యబట్టారు. శ్రీధర్‌బాబు నలభై ఏండ్లలో చేయని అభివృద్ధిని తాను ఎమ్మెల్యేగా ఉన్న ఐదేండ్లలోనే చేసి చూపించానని చెప్పారు. అయినా కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని నమ్మి నన్ను ఇక్కడి ప్రజలు దూరం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రజా సేవను మరువలేదన్నారు. పుట్ట లింగమ్మ ట్రస్ట్ ద్వారా అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టానని పేర్కొన్నారు.
ఎన్నికల టైంల శ్రీధర్‌బాబు నోట్ల కట్టలతో వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పేదల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న బీఆర్ఎస్ను ఆదరించాలని అర్థించారు. తనను గెలిపిస్తే అందుబాటులో ఉండి ప్రజల సేవలో తరిస్తానని, సమస్యలను పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో పాటు తన సొంత ఎన్నికల ప్రణాళికలోని ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తానని పేర్కొన్నారు. ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు.
జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి రాకేశ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విడుదల చేసిన మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. అనంతరం మహదేవపూర్, బొమ్మాపూర్, రాపల్లికోటతో పాటు పలు గ్రామాలకు చెందిన సుమారు 200 మంది యువకులు బీఆర్ఎస్ లో చేరారు. కార్యక్రమంలో కాళేశ్వర ముక్తీశ్వర ఆలయ చైర్మన్ ,బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్‌రావు, పలిమెల బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జవ్వాజి తిరుపతి, పీఏసీఎస్ చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.