mla Kaushik Reddy | హుజురాబాద్, ఏప్రిల్ 24: మోసానికి చిరునామా గ్రానైట్ క్వారీ యజమాని మనోజ్ రెడ్డి అని, ఒకరి మీద అబండాలు వేయడంలో అబద్ధాలు ఆడడంలో ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. కేసీ క్యాంపులో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బడ్డ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండెడు గ్రామం ప్రజలపై క్వారీ యజమాని మనోజ్ రెడ్డి అరాచక పాలన చేస్తున్నాడని, గ్రామ ప్రజల పోరాటానికి తోడుగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నాడని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు, క్వారీ యజమాని మనోజ్ రెడ్డి అక్రమాలకు వ్యతిరేకంగా గళం విప్పగా వారికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అండగా నిలబడ్డారని చెప్పారు.
గ్రానైట్ క్వారీ పెట్టే సమయంలో దేవాలయాలకు రూ.25 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చిన మనోజ్ రెడ్డి కేవలం రూ.15 లక్షలు ఇవ్వడంతో పాడి కౌశిక్ రెడ్డిని గ్రామస్తులు సంప్రదించారని, దీంతో ఆయన స్పందించి మనోజ్ రెడ్డికి ఫోన్ చేశారని పేర్కొన్నారు. దీనికి కౌశిక్ రెడ్డి రూ.50 లక్షలు అడిగారని, తప్పుడు కేసు పెట్టడం దుర్మార్గమని వాపోయారు. దీని వెనక మంత్రుల హస్తం ఉందని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డిని ఎదుర్కొనే సత్తా లేకపోవడం వల్లే విమర్శలు, దొంగ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కట్టు కథల తో కావాలనే అసత్య ఆరోపణలు, కుట్రలు చేస్తుందని ఆరోపించారు.
ఇలాంటి కేసులతో కౌశిక్ రెడ్డి వెనుకడుగు వేయడని, ప్రజల కోసం పోరాడుతూనే ఉంటారని పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి మచ్చలేని నాయకుడని, ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు అన్నారు. తాతల పేర్లు చెప్పుకొని వచ్చినవాడు కాదని, ప్రజల్లోంచి, వారి ఆశీర్వాదాలతో ఎన్నికైన నాయకుడని కొనియాడారు. ప్రజల సమస్యలకు తక్షణమే స్పందించే గొప్ప నాయకుడు కౌశిరెడ్డి అని కొనియాడారు. సమస్యను విన్న వెంటనే అధికారులకు ఫోన్ చేసి, చర్యలు తీసుకునే మనసున్న నాయకుడన్నారు. కౌశిక్ రెడ్డి అంటేనే దూకుడని, అది కూడా ప్రజల కోసమే పనిచేసే మనస్తత్వం ఉన్న నాయకుడని చెప్పారు.
హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన యువనేతని, రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన నాయకుడన్నారు కేసీఆర్, కేటీఆర్ ల విశ్వాసాన్ని పొందిన వ్యక్తి అని, గతంలో బీజేపీ నేత ఈటల రాజేందర్ ను ఓడించిన బలమైన నేత అని పేర్కొన్నారు.
న్యాయ గెలిచింది
గ్రానైట్ క్వారీ కౌశిక్ రెడ్డి పై మనోజ్ రెడ్డి భార్య పెట్టిన తప్పుడు కేసు విషయంలో హైకోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడం న్యాయం గెలిచిందానికి నిదర్శనమని బండ శ్రీనివాస్, తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు పేర్కొన్నారు. ఇది న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకానికి నిదర్శనమని, కౌశిక్ రెడ్డిని విమర్శించే స్థాయి మీది కాదని ఎద్దేవా చేశారు.
నమ్మకంగా గెలిచిన నాయకుడిని విమర్శించేవారికి ప్రజలే బుద్ధి చెబుతారని మండిపడ్డారు. ఈ సమావేశంలో గందే శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, పోల్నేని సత్యనారాయణ రావు, తక్కళ్లపల్లి సత్యనారాయణ రావు, కొలిపాక శ్రీనివాస్ ఇతర నాయకులు పాల్గొన్నారు.