“యాభై ఏళ్ల దరిద్రానికి కారణం కాంగ్రెస్, బీజేపీలే. ఆ పార్టీలకు ఓటేస్తే తెలంగాణ భవిష్యత్ అంధకారం అవుతుంది. కరెంటు వెలుగులు కావాలా.. కాంగ్రెస్ చీకట్లు కావాలా..? ఎంపీగా గెలిచిన బండి సంజయ్ నాలుగున్నరేండ్లుగా పత్తా లేకుండా పోయిండు. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ తిరుగుతున్నడు. కానీ, ఆ పార్టీ రెండు సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదు. అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్కు ఓటేయండి.
మానేరు రివర్ ఫ్రంట్‌ను వచ్చే ఏడాది లోగా పూర్తి చేసి ప్రపంచ స్థాయి ఖ్యాతిని తీసుకొస్తా” అని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు గురువారం ఉదయం కరీంనగర్ శివారులోని మానేరు డ్యాం కట్ట వద్ద వాకర్స్‌ను కలిసి ప్రచారం చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాగి జావ తాగుతూ వారితో ముచ్చటించారు. తర్వాత కొత్తపల్లి మండలంలోని శ్రీరాములపల్లి, ఎలగందల్ గ్రామాల్లో, సాయంత్రం నగరంలోని పలు డివిజన్లలో ప్రచారం చేశారు.
– కరీంనగర్ కార్పొరేషన్/ కొత్తపల్లి, నవంబర్ 23
కొత్తపల్లి, నవంబర్ 23 : కరెంటు వెలుగులు కావాలా.. కాంగ్రెస్ చీకట్లు కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని బీఆర్ఎస్ కరీంనగర్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ఆ పార్టీకి ఓటేస్తే తెలంగాణ భవిష్యత్ అంధకారం అవుతుందని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం కొత్తపల్లి మండలంలోని శ్రీరాములపల్లి, ఎలగందల్ గ్రామాల్లో, సాయంత్రం నగరంలోని పలు డివిజన్లలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి ప్రసంగించారు. బండి సంజయ్‌ను ప్రజలు ఎంపీగా గెలిపిస్తే నాలుగున్నరేళ్లుగా పత్తా లేకుండా పోయి, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడిగేందుకు వస్తున్నాడని ప్రశ్నించారు. బీసీ ముఖ్యమంత్రి అని బీజేపీ చెప్పుకొని తిరుగుతున్నప్పటికీ రాష్ట్రంలో బీజేపీ వచ్చేది లేదన్నారు. ఆ పార్టీ తెలంగాణలో రెండు సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.
రైతు ఆత్మహత్యలు, కరెంటు కోతలతో తెలంగాణ దరిద్రానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని, మళ్లీ వారిని నమ్మి మోసపోతే తెలంగాణ యాభై ఏళ్లు వెనకి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. యాభై ఏళ్ల దరిద్రం కోరుకుందామా.. పదేళ్ల అభివృద్ధి కొనసాగిద్దామా? ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. ఓటు ఎంతో పవిత్రమైనదని, ఒక ఓటు తప్పు జరిగినా మన పిల్లల భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు. నెల రోజుల్లో శ్రీరాములపల్లిని నూతన గ్రామ పంచాయతీగా చేస్తానని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నూతన సర్పంచ్ ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఎన్నికలప్పుడు మాత్రమే కనిపిస్తారని, తాను మాత్రం ఎల్లప్పుడూ కళ్ల ముందుండే బిడ్డనని, తనను ఆశీర్వదించాలని వేడుకున్నారు. మానేరు రివర్ ఫ్రంట్‌ను వచ్చే ఏడాదిలోగా పూర్తి చేసి కరీంనగర్‌కు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువస్తానని, ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఇక్కడ ఎంపీపీ పిల్లి శ్రీలతామహేశ్, గ్రామ సర్పంచ్ ఎల్దండి షర్మిలాప్రకాశ్, ఎంపీటీసీ మంద రమేశ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.