తిమ్మాపూర్ రూరల్, అక్టోబర్ 30: కాంగ్రెస్ పార్టీవి భరోసా లేని పథకాలని, వారి పాలనలో గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచాయని మానకొండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రసమయి బాలకిషన్ విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్లీ రాష్ట్రం అంధకారంలోకి పోతుందని వాపోయారు. నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశానని మరోసారి తనను ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు. సోమవారం సాయంత్రం మండలంలోని జూగుండ్ల, రాం హనుమాన్‌నగర్, వచ్చునూరు, నేదునూరు, లక్ష్మీదేవిపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రసమయి మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో గ్రామాల రూపు రేఖలు ఎంతగానో మారాయని తెలిపారు.
కాంగ్రెస్ రైతులపై విషం కక్కుతుందని, అందుకే ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసి రైతుబంధును ఆపాలని చూశారని తెలిపారు. మూడు గంటలు కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలో, 24 గంటల కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ కావాలో రైతులు ఆలోచించాలన్నారు. రైతన్నలకు భరోసా కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మళ్లీ అధికారంలోకి రాగానే రూ.16 వేల రైతుబంధు అందజేస్తామన్నారు.
అధికారంలోకి రాగానే రైతుబంధు తరహాలో తెల్ల రేషన్ కార్డ్ ఉన్న ప్రతి కుటుంబానికి రూ.5లక్షల బీమా కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం అమలు చేసి సామాన్య ప్రజానికానికి అండగా నిలిచిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. ఎన్నికలు రాగానే అధికారం కోసం పగటి వేషాలు వేస్తూ..దొంగ హామీలను ఇచ్చే కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
మాయ చేసే నాయకులు వస్తున్నారని, మాటలు నమ్మి ప్రజలు ఆగం కావద్దని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పని చేసిందని, ఎన్నికల్లో ప్రజలు రాష్ట్ర అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. తాను ఎంతో అభివృద్ధి చేశానని, ఇంకా చేస్తానని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, ఇనుకొండ జితేందర్ రెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ లాగుల వీరారెడ్డి, సర్పంచులు ఎల్లేశ్, యాదగిరి వెంకటేశ్వరరావు, ఉప్పులేటి ఉమారాణి, వడ్లూరి శంకర్, పద్మజ, మల్లెత్తుల అంజయ్య, ఎంపీటీసీ కనకం కొమురయ్య, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.