పాలకుర్తి, ఫిబ్రవరి 4: స్వరాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారని, సర్కారు బడులను కార్పొరేట్‌కు దీటుగా సకల వసతులతో తీర్చిదిద్దుతున్నారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్కొన్నారు. ‘మన ఊరు-మనబడి’ కింద 13లక్షలతో ఆధునీకరించిన గన్శ్యాందాస్నగర్ (జీడీనగర్) ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సంగీత సత్యనారాయణ, డీఈవో మాధవితో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు.
నూతనంగా నిర్మించిన వాష్‌రూంలు, కిచెన్‌షెడ్డు, గ్రీన్‌బోర్డులు, ప్లేగ్రౌండ్ తదితర సౌకర్యాలను చూసి సంతోషపడ్డారు. అనంతరం సర్పంచ్ సూర సమ్మయ్య అధ్యక్షతన స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్షతో విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్‌ను జీడీనగర్ బీఆర్ఎస్ నాయకుడు బండారి శ్రీవాణీకిరణ్ గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కుమార్‌దీపక్, డీఎఫ్‌వో శివయ్య, ఆర్డీవో వీరబ్రహ్మయ్య ఎంపీడీవో లలిత, ఎంఈవో దాసరి లక్ష్మి, ఎంపీవో షబ్బీర్, పీఆర్ ఏఈ శ్రీనివాస్, కాంప్లెక్స్ హెచ్ఎం మాధురి, హెచ్ఎం రవీంద్రకుమార్, జడ్పీటీసీ సంధ్యారాణి, సింగిల్ విండో చైర్మన్ బయ్యపు మనోహర్‌రెడ్డి, ఎంపీటీసీ బండారి శ్రీవాణీకిరణ్, ఉపసర్పంచ్ రెడపాక మల్లేశ్ పాల్గొన్నారు.
తల్లిదండ్రులు ఆలోచించాలి
‘మన ఊరు – మనబడి’ కింద ప్రభుత్వం కోట్లాది నిధులతో సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. జీడీనగర్ సర్పంచ్ సూర సమ్మయ్య ప్రత్యేక చొరవ తీసుకుని అభివృద్ధి పనులు వేగవంతం చేయడం అభినందనీయం. ప్రభుత్వం ఉచితంగా సకల వసతులతో అందించే విద్యను విస్మరించి కార్పొరేట్ శక్తుల ప్రకటనలు నమ్మి మోసపోవద్దు. తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాలి.
-కలెక్టర్ సంగీత సత్యనారాయణ