PEDDAPALLY | కమాన్ పూర్, ఏఫ్రిల్ 9 : కమాన్ పూర్ మండలంలోని సిద్దిపల్లె గ్రామానికి చెందిన నామని రాజేశం (70) ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నామని రాజేశం సిద్దిపల్లెలోని తన వ్యవసాయ భూమిలో సాగు చేసిన వరి పంట కోతకు రావడంతో సంప్రదాయ పద్దతిలో కోడి పుంజును పోత లింగన్న గుడి వద్ద కోసేందుకు తీసుకెళ్లాడు. అక్కడ దానిని కోసేందుకు సంచిలో నుండి బయటకు తీశాడు.
ఈ క్రమంలో కోడి పుంజు ఎగిరిపోయింది. దానిని దొరకబట్టే క్రమంలో ఎగిరిన కోడి పుంజు బావులోకి దూకింది. దానిని పట్టుకునే క్రమంలో రాజేశం ప్రమాదవ శాత్తు కాలు జారీ వ్యవసాయ బావిలో పడిపోయాడు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవ్వరు లేకపోవడంతో రాజేశం బావిలోనే మృతి చెందాడు. కోడి కోయడం కోసం పొలం వద్దకు వెళ్లి తిరిగిరాక పోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించగా ఆ బావిలో పడిపోయినట్లు గుర్తించారు.
ఈ మేరకు కమాన్ పూర్ పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ బావిలో నుండి రాజేశం మృతదేహన్ని బయటకు తీసి పోస్టు మార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కమాన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.