సైదాపూర్ : తమపై భౌతిక దాడికి పాల్పడిన సోదరుడిపై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన దుర్గం కొమురయ్య అనే వ్యక్తి ఆదివారం శంకరపట్నం మండలంలోని కేశవపట్నం గ్రామంలో పురుగుల మందు డబ్బాతో ఓ సెల్ టవర్(Cell tower) ఎక్కి నిరసనకు దిగాడు. తన తమ్ముడు తిరుపతి ఇటీవల తనతో పాటు తన భార్యపై భౌతిక దాడికి పాల్పడ్డాడని ఈ ఘటనతో మానసిక క్షోభకు గురైన తన భార్య క్రిమిసంహారిక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు.
తమపై అకారణంగా దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సైదాపూర్ పోలీసులతో పాటు సీపీకి సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించాడు. తనకు న్యాయం జరగకపోతే సెల్ టవర్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. సమాచారం అందుకున్న కేశవపట్నం బ్లూ కోట్ పోలీసులు అక్కడికి చేరుకొని న్యాయం చేస్తామని నచ్చ చెప్పడంతో సెల్ టవర్ దిగి వచ్చాడు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.