GODAVARIKHANI | కోల్ సిటీ, మే 2: నిబంధనలకు విరుద్ధంగా గర్భిణులకు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారన్న ఫిర్యాదుతో ఇటీవల దవాఖానను తనిఖీ చేసేందుకు వచ్చిన దళిత జిల్లా వైద్యాధికారి అన్న ప్రసన్న కుమారి విధులకు ఆటంకం కలిగించడంతోపాటు చంపుతామని బెదిరించిన హాస్పిటల్ నిర్వాహకులు, మాజీ మేయర్ అనిల్ కుమార్, మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామిని వెంటనే అరెస్టు చేయాలని, అనుమతి లేకుండా స్కానింగ్ పరీక్షలు చేస్తున్న మమత హాస్పిటల్ ను వెంటనే సీజ్ చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం డిమాండ్ చేసింది.
ఈ మేరకు ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు శుక్రవారం డీఎంహెచ్ఓ ను కలిసి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలతో ప్రైవేట్ హాస్పిటల్ తనిఖీ చేయడానికి వచ్చిన జిల్లా వైద్యాధికారిణి పై తిరగబడడంతోపాటు ఆమె పైన కేసు నమోదు చేయించడం సరైంది కాదని పేర్కొన్నారు.
డీఎంహెచ్వో విధులకు ఆటంకం కలిగించి చంపుతామని బెదిరించిన ఆసుపత్రి నిర్వాహకులు, వైద్యులు, మాజీ ప్రజాప్రతినిధులపై అట్రాసిటీ కేసు కింద నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే డీఎంహెచ్ఓపై నమోదు చేసిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రజల్లో రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, డాక్టర్లపై నమ్మకం పోయేలా ప్రవర్తించిన ఈ సంఘటనను తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ ను కలిసి ప్రభుత్వ అధికారిని పట్ల బెదిరింపులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసేలా ఆదేశించాలని కోరారు.
అలాగే ఈ సంఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా మంత్రి శ్రీధర్ బాబును కూడా కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సంకనపల్లి లక్ష్మయ్య, సందీప్, నారాయణ, కన్నూరి బాపు, సంతోష్, కనుకుంట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.