గోదావరిఖని : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 12 న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె ( General strike ) లో సింగరేణి కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి జేఏసీ సంఘాల ( JAC unions ) నాయకులు పిలుపునిచ్చారు. నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కచ్చకాయల సదానందం , తుమ్మల రాజిరెడ్డి, నూనె కొమురయ్య, ఐ.క్రిష్ణ, పెద్దపల్లి సత్యనారాయణ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ ల వల్ల కార్మిక వర్గానికి తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యానికి పూర్వం దేశంలో ఉన్న కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లు గా మార్చిందని విమర్శించారు.
ఈ లేబర్ కోడులను ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయడం కోసం పరిశ్రమల యాజమాన్యాలు ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. కొత్త లేబర్ కోడ్ లు కార్మికుల హక్కులను హరిస్తాయని, కార్మిక వర్గానికి నష్టం జరిగే లేబర్ కోడులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జేఏసీ కార్మిక సంఘాల నాయకులు మడ్డి ఎల్లా గౌడ్, వై వి రావు, ఎం ఎ గౌస్, నరహరి , రాజమౌళి , వడ్డెపల్లి శంకర్, ఈదునూరి నరేశ్, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.