జగిత్యాల, జూన్ 24 : జగిత్యాల జిల్లాలోని ఓ రైస్‌మిల్లులో భారీ కుంభకోణం వెలుగుచూసింది. జగిత్యాల సమీపంలోని రఘురాముల కోట గ్రామ శివారులో ఉన్న ఓ రైస్‌మిల్లుపై సోమవారం అర్ధరాత్రి టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు.
జగిత్యాలకు చెందిన ఓ రైస్‌మిల్లు యజమానికి మూడు నాలుగు రైస్‌మిల్లులు ఉన్నాయని, వాటి ద్వారా పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్నాడనే పక్కా సమాచారం మేరకు స్టేట్ టాస్క్‌ఫోర్స్ అధికారులు రఘురాముల కోటలోని రైస్‌మిల్లుపై దాడులు చేశారు. అర్ధరాత్రి ఒక ట్రక్కులో రేషన్ బియ్యం మిల్లుకు తరలిస్తుండగా, ఆ ట్రక్కును అనుసరించిన అధికారులు రైస్‌మిల్లును సీజ్ చేసినట్లు తెలుస్తోంది. మిల్లులో బియ్యం నిల్వలకు, ప్రభుత్వ ధాన్యం లెక్కలకు మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ స్కాం విలువ కోట్ల రూపాయల్లో ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సీజ్ చేసిన రైస్‌మిల్లుకు పోలీసు పహారా ఏర్పాటు చేశారు. మంగళవారం పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి, రాత్రి వరకు వివరాలు వెల్లడించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
కాగా, సీజ్ చేసిన రైస్‌మిల్లును వదిలిపెట్టాలని, విషయాన్ని చూసీచూడనట్లు వ్యవహరించాలని అధికారులపై తీవ్ర రాజకీయ ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. సదరు రైస్‌మిల్లు యజమాని తనకున్న పలుకుబడితో మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయికి విషయాన్ని తీసుకెళ్లి అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
Read More