మల్లాపూర్, నవంబర్ 4: మక్క రైతులు రోడ్డెక్కారు. ఓ వైపు వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు నిబంధనల పేరిట ప్రభుత్వం కొనుగోళ్లలో జాప్యం చేయడంపై ఆగ్రహించారు. మంగళవారం మల్లాపూర్ మార్కెట్‌యార్డు ఎదుట రహదారిపై బైఠాయించి గంటపాటు ధర్నా చేశారు. వెనువెంటనే కొనాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మల్లాపూర్ మండలంలో ఒక్కటే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్నదని వాపోయారు.
గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మక్కలు వస్తున్నాయని, వారం నుంచి నిరీక్షించినా కనీసం తేమశాతం చూసేవారే కరువయ్యారని వాపోయారు. సెంటర్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయని, తాగేందుకు నీళ్లు కూడా లేవని మండిపడ్డారు. నిర్వాహకుల్లో కొంత మంది వారికి తెలిసిన లీడర్ల మక్కలను కొనుగోలు చేస్తున్నారని, తమను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నిబంధనలు ఎత్తివేసి మక్కల కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో మాజీ జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు. ఏఎస్ఐ లక్ష్మయ్య సంఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి శాంతింపజేశారు.