Poor Sanitation | కోల్ సిటీ, మార్చి 17: రామగుండం నగర పాలక సంస్థ 40వ డివిజన్ ఎల్బీ నగర్, సీపీఐ జెండా వద్ద గల ప్రధాన డ్రైనేజీ దారుణంగా ఉంది. నివాస గృహాల మధ్య గల ఈ ప్రధాన డ్రైనేజీలో పిచ్చి చెట్లు, చెత్తాచెదారంతో పేరుకపోతున్నా పట్టించుకునే వారే లేరని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. తీవ్రమైన దుర్గంధంతో ఇళ్లలో ముక్కుమూసుకొని ఉండాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు. ఇప్పటికే నగర పాలక సంస్థ కార్యాలయంలో ఒకటికి, రెండుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
పాలకుల నిర్లక్ష్యం, సిబ్బంది నిర్వాకం శాపంగా మారిందని ఆ డివిజన్ ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్లపై చెత్తంతా కాలువలో పడి నెలల తరుబడి పేరుకపోవడంతో గాలి వీచిన సమయంలో తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోందని, అప్పుడు ఇళ్లలో శ్వాస తీసుకోలేని పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఈ దుర్గంధం కారణంగా చిన్నారులు, వృద్ధులు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక చేస్తున్నారు. చుట్టు పక్కల వారు సైతం రాత్రి వేళల్లో పచ్చి ఇక్కడి ఓపెన్ డ్రైనేజీలో చెత్తను పడేసి వెళ్తున్నారని వాపోతున్నారు.
ఈదురు గాలులకు కాలువలోని చెత్తంతా ఇళ్లలోకి వస్తుండటం మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని పేర్కొంటున్నారు. నగర పాలక సంస్థ పారిశుధ్య నిర్వహణపై మొక్కుబడిగా కార్యక్రమాలు చేపడుతుందని ఆరోపిస్తున్నారు. సంబంధిత పారిశుధ్య విభాగం అధికారుల దృష్టికి తీసుకవెళ్లినా ప్రయోజనం ఉండటం లేదని, కలెక్టర్ స్పందించి ఎల్బీ నగర్ లో గల ఈ ప్రధాన సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.