Dharmaram | ధర్మారం నవంబర్ 28: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్ లో జ్యోతిబాపూలే వర్ధంతి వేడుకలను శుక్రవారం నిర్వహించారు. కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లి స్వామి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించి మహాత్మ జ్యోతిరావుపూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ బహుజనులకు విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు అని అన్నారు..
అణిచి వేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారికి సాధికారత కల్పించడంలో ఎంతో కృషి చేసిన సామాజిక సంఘ సంస్కర్త విద్యావేత్త పూలే అని కొనియాడారు. హక్కుల కోసం పోరాడి తన జీవితాన్ని అంకితం చేశాడని ఈ సందర్భంగా అన్నారు.
ఆది నుంచి కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూనే మహిళా విద్య కోసం ఎనలేని కృషి చేశాడని స్త్రీలు సమానత్వం పొందాలంటే విద్య తప్పని సరని విశ్వసించి 1948వ సంవత్సరములో పూణేలో బాలికల కోసం తొలిసారిగా పాఠశాలను స్థాపించారని ఇలా దేశ వ్యాప్తంగా మొత్తం140 పాఠశాలను ప్రారంభించారని పూలే దంపతులు బాల్య వివాహాలను వ్యతిరేకించారని ,వితంతు పునర్వివాహానికి మద్దతుగా నిలిచారని ఆయన గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ (టీజీపీఏ) రాష్ట్ర నాయకులు ధార మధు, నాయకులు కాంపల్లి రాజేశం, మల్లేశం, ఇరుగురాల రాజనర్సు, చిలుముల రాజ మల్లయ్య, దూడ లచ్చయ్య, బహుజన నాయకులు గుండా గంగయ్య, మదన్మోహన్, రామగిరి లింగయ్య, ఉప్పులేటి రాజేశం, కాంపల్లి సతీష్, గాజుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.