వేములవాడ టౌన్, ఫిబ్రవరి 26: శివనామస్మరణతో ఉమ్మడి జిల్లాలోని శైవక్షేత్రాలు మారుమోగాయి. మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేములవాడ రాజన్న క్షేత్రంతోపాటు పెంబట్ల దుబ్బ రాజేశ్వర దేవాలయం, పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరస్వామి దేవాలయం, కోటిలింగాల, ఓదెల మల్లన్న, జనగామ త్రిలింగేశ్వరాలయం, కరీంనగర్లోని పాతబజారు శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గంటల కొద్దీ క్యూలైన్లలో నిల్చొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు.
వేములవాడ రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి సుమారు 2లక్షలకుపైగా మంది తరలివచ్చారు. గంటల తరబడి మరీ క్యూ లైన్లలో ఉండి మరీ స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఉదయం7 గంటలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాజన్నకు పట్టువస్ర్తాలు సమర్పించారు. సాయంత్రం 5 గంటలకు దాదాపు 2వేలమంది శివభక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. 6గంటలకు అద్దాల మండపంలో అనువంశిక అర్చక కుటుంబాలకు చెందిన అగ్రహార బ్రాహ్మణులు మహాలింగార్చన అంగరంగ వైభవంగా జరిపించారు. రాత్రి 11:30 గంటలకు ఆలయంలో లింగోద్భవకాలంలో అర్చకులు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని కనుల పండువలా నిర్వహించారు.