వేములవాడ టౌన్, ఫిబ్రవరి 25 : నేటి మహాశివరాత్రి వేడుకలకు శైవక్షేత్రాలన్నీ ముస్తాబయ్యాయి. మంగళవారం రాత్రి నుంచే రంగురంగుల విద్యుద్దీపాల వెలుగుల్లో కాంతులీనుతున్నాయి. వేములవాడ రాజరాజేశ్వ క్షేత్రంలో మూడు రోజుల ఉత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. రాత్రి 7 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్.. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం.. శృంగేరి పీఠం తరఫున పీఠాధిపతి శిష్యుడు రాథాకృష్ణ రాజన్నకు పట్టువస్ర్తాలను సమర్పించారు.
అనంతరం మంత్రి, విప్ ఆలయ పార్కింగ్ స్థలంలోని శివార్చన సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుండగా, ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, వివిధ శాఖల అధికారుల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండగా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా గట్టిపోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బుధవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సాయంత్రం 6 నుంచి 9 గంటలవరకు బ్రాహ్మణ అనువంశిక కుటుంబాల అర్చకులచే మహాలింగార్చన, రాత్రి 11 గంటలకు లింగోద్భవకాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఘనంగా నిర్వహిస్తారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బుధవారం స్వామివారిని దర్శించుకుంటారని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు తెలిపారు.