వేములవాడ టౌన్, ఫిబ్రవరి 24: మహాశివరాత్రి ఉత్సవాలకు వేములవాడ రాజన్న క్షేత్రం సరికొత్త శోభ సంతరించుకున్నది. నేటి నుంచి మూడురోజులపాటు అంత్యత వైభవోపేతంగా జరిగే వేడుకలకు సుందరంగా ముస్తాబైంది. రాత్రి వేళ విద్యుద్దీపాలతో ఆలయం కాంతులీనుతున్నది. జాతరకు రాష్ట్రంతోపాటు వివిధ రాష్ర్టాల నుంచి నాలుగు లక్షల మంది భక్తులు తరలిరానుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు.
తాగునీరు, వసతి, పారిశుధ్యం, పార్కింగ్ స్థలాలతోపాటు పట్టణంలో ఆరోగ్య కేంద్రాలు, హెల్ప్లైన్లను సిద్ధం చేశారు. మంగళవారం రాత్రి 7 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున రాత్రి 7.30 గంటలకు టీటీడీ అధికారులు పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు.