ముఖ్యమంత్రి కేసీఆర్ ధార్మికచింతనతో రాగినేడులో అద్భుతమైన ఆలయం రూపుదిద్దుకున్నది. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ చొరవ, స్థానిక దాతలు, భక్తుల విరాళాలతో చెట్టుకింది శివయ్యకు 2.50 కోట్లతో గుడి నిర్మాణమైంది. నేటి నుంచి మూడురోజులపాటు నాగలింగేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహించనుండగా, కోలేటి దామోదర్ ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేశారు. శుక్రవారం పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరుకానుండగా, సీపీ రెమా రాజేశ్వరి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
పెద్దపల్లి, మే 9 (నమస్తే తెలంగాణ)/ పెద్దపల్లి రూరల్: 30 ఏళ్ల క్రితం పోతరాజుల భూమయ్య, లక్ష్మయ్య పొలంలో శివలింగం కనిపించింది. ఊరు ఊరంతా తరలివచ్చి స్వయంభువుగా వెలసిన శివలింగాన్ని చూసి భక్తితో పులకించిపోయారు. సమీపంలోని రావిచెట్టు, వేపచెట్టు నీడలో ప్రతిష్ఠించారు. ఆ శివలింగాన్ని 20 గ్రామాల ప్రజలు నాగలింగేశ్వరుడిగా ఆరాధిస్తున్నారు. శివలింగాన్ని దర్శించిన పురావస్తు శాస్త్రవేత్తలు అది కాకతీయుల కాలం నాటిదని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆ ఊరి దళిత సోదరులు పోతురాజుల భూమయ్య, లక్ష్మయ్య దేవాలయ నిర్మాణానికి 20 గుంటల భూమిని విరాళంగా ఇచ్చారు. అది సరిపోక పోవడంతో మరో 2 గుంటలు సైతం ఇచ్చారు. అప్పటి నుంచి అక్కడ ఆలయ నిర్మాణానికి సహకరించాలని నాటి కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులకు స్థానికులు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్..
తన స్వగ్రామంలో వెలసిన నాగలింగేశ్వరుడికి ఆలయం నిర్మించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం అందించారు. దేవాదాయశాఖ ద్వారా 50 లక్షల నిధులు మంజూరు చేయించారు. తగిన ప్రణాళికలు సిద్ధం చేసి, దేవాలయ నిర్మాణంలో సిద్ధహస్తులైన స్థపతులను సంప్రదించి, ఆగమ శాస్త్ర విధానాలను అనుసరించి డిజైన్లు రూపొందించారు. వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం ఆలయాల ప్రధాన అర్చకుల సూచనల మేరకు 2021 ఆగస్టు 13న దేవాలయ నిర్మాణానికి కోలేటి దామోదర్ శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ నిధులు, భక్తుల, దాతల ఆర్థిక సాయంతో ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. గ్రామ ప్రవేశం వద్ద శివపార్వతులు, గణేశుడు, సుబ్రహ్మణ్యస్వామి, సాయిబాబా, తదితర దేవతా విగ్రహాలతో స్వాగత తోరణ ద్వా రాన్ని నిర్మించారు. ప్రహరీపై 34 నంది విగ్రహాలు ఏర్పాటు చేశారు. దాదాపు 2.50 కోట్లతో ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేశారు. నేటి నుంచి ప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహిస్తుండగా, అందుకు ఏర్పాట్లన్నీ చేశారు. ప్రధాన ద్వారం నుంచి దేవాలయం వరకు రంగురంగుల విద్యుద్దీపాలు అమర్చారు.
నేటి నుంచి ప్రతిష్ఠాపనోత్సవాలు
రాగినేడు శివయ్యకు నేటి నుంచి ప్రతిష్ఠాపనోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. జగద్గురు పుష్పగిరి శంకరాచార్య శ్రీ విద్యాశంకర భారతీస్వామి ఆధ్వర్యంలో దేవతా విగ్రహాల ప్రతిష్ఠ జరుగనుండడంతో స్వామి వారి శిష్య బృందం నుంచి 25 మంది పుష్పగిరి పీఠం స్వాములు మంగళవారం సాయంత్రమే రాగినేడుకు చేరుకున్నారు. బుధవారం ఉదయం గ్రామంలో భారీ ఊరేగింపు చేపట్టనున్నారు. ఉదయం 8.30 గంటలకు గోపూజ, గణపతి పూజ, గురువందనంతో ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభించనున్నారు. గురువారం హోమం, యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్ఠాపన, కళాన్యాసం, కుంభాభిషేకంతో జలాధివాసం, ఉత్థాపనలు, శయ్యాధివాసం కార్యక్రమాలను నిర్వహించనున్నారు. శుక్రవారం దేవాలయ ప్రతిష్ఠ చేయనున్నారు.
పాల్గొననున్న మంత్రులు
ప్రతిష్ఠాపనోత్సవాల్లో శుక్రవారం మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్, మండలి చీఫ్‌విప్ తానిపర్తి భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరుకానున్నారు. మంగళవారం రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా పరిశీలించారు. రామగుండం సీపీ రెమారాజేశ్వరి అధికారులతో కలిసి దేవాలయ ప్రాంతాన్ని పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. వారి వెంట ఏసీపీ ఎడ్ల మహేశ్, సీఐలు ప్రదీప్‌కుమార్, ఇంద్రసేనారెడ్డి, అనిల్‌కుమార్, ఎస్ఐలు రాజేశ్, శ్రీనివాస్, మౌనిక ఉన్నారు.