World Telugu Literary Conference | కోల్ సిటీ, జూన్ 1 : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కి చెందిన ప్రముఖ ఇంద్రజాలికుడు, కవి, కళాకారుడు, వ్యాఖ్యాత, వెంట్రిలాక్విస్ట్, బహుముఖ ప్రజ్ఞాశాలి మేజిక్ రాజాకు మరో అరుదైన అవకాశం లభించింది. 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. చైతన్య సారస్వత పరిషత్ సౌజన్యంతో అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని రాజ మహేంద్రవరంలో జూన్ 6, 7 తేదీల్లో ఈ మహాసభలు జరుగనున్నాయి. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సాంప్రదాయాలు, కళలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పే అక్షర మహోత్సవంగా ఈ సభలు రూపుదిద్దుకుంటున్నాయని నిర్వాహకులు తెలిపారు.
ఈ మహాసభల్లో దేశ, విదేశాల నుండి సాహిత్య, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు, భాషాభిమానులు పాల్గొననున్నారని, తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచే మహోత్సవంగా ఇది అవతరించనుందని పేర్కొన్నారు. గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ వేదికగా అత్యంత వైభవంగా జరగనున్న ఈ మహాసభల్లో కవితా పఠనం, ఇంద్రజాలం, మిమిక్రీ, వెంట్రిలాక్విజం ప్రదర్శనల విభాగాల్లో పాల్గొనాలని నిర్వాహకులు, శ్రీ శ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షురాలు జి.ఈశ్వరీ భూషణం, జాతీయ ప్రణాళికా అధికారి డాక్టర్ టీ పార్థసారథి మేజిక్ రాజాను ఆహ్వానించారు. ఈ మేరకు రాజాకు డిజిటల్ ఆహ్వాన పత్రిక పంపించారు. కళా సాహిత్య అభిమానులు రాజాకు అభినందనలు తెలిపారు.