Kolanuru | ఓదెల, జులై 22 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామంలోని రజక కులస్తులు మడేలయ్య స్వామి బోనాల ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని రజక కులస్తులందరూ ఇంటికో బోనం చొప్పున డిజె సాంగ్స్ మధ్యన ఊరేగింపుగా ఊర చెరువు కట్ట వద్ద ఉన్న మడేలయ్య స్వామి ఆలయానికి నృత్యాలు చేసుకుంటూ తరలి వెళ్లారు. అంతకు ముందు గ్రామంలోని పోచమ్మ దేవాలయం, గ్రామదేవతల వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు బోనంతో నైవేద్యం పెట్టి మొక్కలు చెల్లించుకున్నారు.
మడేలయ్య స్వామి కరుణ వలన వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు కుంటలు నీటితో నిండి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ ఉత్సవాలలో పెద్దపల్లి ఏఎంసి డైరెక్టర్ కొల్లూరు చందు, వార్డు సభ్యులు దుర్శేటి శ్రీనివాస్, కొల్లూరి సంధ్య, కొల్లూరి మధునయ్య, కొల్లూరి శంకర్, తోటపల్లి కుమార్, ఎనగందుల గోపాల్, అన్నారపు శంకర్, అంతగిరి కొమురయ్య , మధు, రాజు, రమేష్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.