Vemulawada | వేములవాడ, ఆగస్టు 13 : వ్యవస్థలోని లోపాలను ఎప్పటికప్పుడు సరి చేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని వేములవాడ ఏరియా ఆసుపత్రికి వచ్చిన ఒక రోగి ఎదుర్కొన్న సమస్యలపై మాట్లాడుతూ వీడియోను రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది. వేములవాడ రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన దాదాపు 40 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వైద్య సేవల కోసం గురువారం వచ్చినట్లు వీడియోలో పేర్కొన్నాడు. ఓపిలో పేరు నమోదు చేసుకునే సిబ్బంది రాకపోగా బీపీ చూసే సిబ్బంది మాత్రం ముందుగానే వచ్చారని అందులో అన్నారు. ఓపి పత్రం అందుకున్న తర్వాత వైద్యుల దగ్గరికి వెళితే వారం రోజులుగా జ్వరంతో బాధ పడుతున్న బాధని వివరించడంతో సదరు వైద్యుడు సిబిపి తో పాటు ఆర్బిఎస్, వైడల్, డెంగ్యూ తదితర రక్త పరీక్షలను రోగనిర్ధారణ చేపించుకోవాలని సూచించాడని తెలిపారు. అయితే పరీక్షలు నిర్వహించుకునేందుకు ల్యాబ్ వద్దకు చేరుకోగా ఇందులో సి.బి.పి యంత్రం పనిచేయడం లేదని ఇది ఇప్పుడు ఇక్కడ చేయడం సాధ్యం కాదని చెప్పారని అతను అందులో పేర్కొన్నాడు.
మిగతా పరీక్షలు కూడా ఈరోజు రాత్రికి మీ ఫోన్ కు వస్తాయని మరుసటి రోజు మీ సేవలో రిపోర్టులు ప్రింట్ తీసుకొని వచ్చి వైద్యునికి చూపెట్టుకోవాలని సలహా ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. వచ్చిందే రోగంతో ఆసుపత్రికి పైగా రోగనిర్ధారణ కోసం వైద్యులు పరీక్షలు నిర్వహించుకోవాల్సిందిగా సూచిస్తే ఇక్కడ పరీక్షలు ఈరోజు కాదు రేపు వస్తాయని చెబితే మళ్లీ మరో సారి ప్రయాణ ఖర్చులు భరించి ఎలా ప్రభుత్వాసుపత్రికి వస్తారని వీడియోలో రోగి ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో రెండు మూడు గంటల్లో రోగ నిర్ధారణ పరీక్షలు ఇస్తుండగా ప్రభుత్వాసుపత్రిలో మరుసటి రోజు ఎందుకు అని ఆయన ప్రశ్నిస్తూ వ్యవస్థలోని లోపాలు సరిచేసి వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వీడియోలో ఎమ్మెల్యే తోపాటు అధికారులను ఆయన కోరారు. గతంలో ఏరియా ఆసుపత్రిలో చాలా మంచి సేవలు అందమని ఇక్కడే తన భార్యకు కాన్పు కూడా చేయించాను అని గుర్తు చేస్తూ ప్రస్తుతం సేవలు అధ్వానంగా ఉండడంతో పాటు సమాధానం నిర్లక్ష్యంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బాధిత రోగి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.