జగిత్యాల రూరల్, నవంబర్ 15 : జగిత్యాల జిల్లా కేంద్రంలోని నూకపల్లి అర్బన్ కాలనీలో గల డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపునకు నిర్వహించిన లక్కీడ్రాలో తమ పేర్లు రాకపోవడంతో దరఖాస్తుదారులు శనివారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం డబుల్ బెడ్రూం ఇండ్లల్లోకి వెళ్లి తాళాలు పగులగొట్టి అందులో ఉన్నారు. కాగా, ఇక్కడి డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం 3 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అధికారులు 1,089 దరఖాస్తులను ఎంపిక చేసి హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్యాలయానికి పంపించారు.
ఇందులో నుంచి 360 డిగ్రీ యాప్ ద్వారా లబ్ధిదారులను వడపోయగా గతంలో ఇండ్లు పొందిన, వాహనాలు ఉన్న వారి పేర్లు తొలగించారు. 535 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి, ఇండ్ల కేటాయింపునకు శనివారం జగిత్యాలలోని కలెక్టర్ కార్యాలయంలో అధికారులు లక్కీడ్రా తీశారు. కాగా, లక్కీడ్రాలో ఇండ్లు రాని వారు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, హౌసింగ్ పీడీ భాస్కర్, మున్సిపల్ కమిషనర్ స్పందన, జగిత్యాల రూరల్ తహసీల్దార్ రామ్మోహన్ పాల్గొన్నారు.
ఎన్ని సార్లు దరఖాస్తులు పెట్టాలి
ఏం ప్రభుత్వం ఇది. ఎన్ని సార్లు డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం దరఖాస్తు పెట్టుకోవాలి. పైసలు, టైం దండుగ అయితుంది. కానీ లిస్టులో పేరున్నా డబుల్ బెడ్రూం మాత్రం వస్తలేదు. నిరుపేదలను కాదని ఇండ్లు ఉన్నోళ్లకే మళ్లీ ఇండ్లు ఇచ్చిండ్రు. ఇండ్ల జాగాలు ఉన్నోళ్లకే డబుల్బెడ్రూం వచ్చింది. ఇల్లు లేనివారికి ఎందుకు ఇవ్వడం లేదు. నాపేరు మొన్నటి లిస్టులో ఉంది. కలెక్టర్ కార్యలయానికి పోనివ్వడం లేదు. పోలీసులను కాపాల పెట్టారు. నాకు ఎందుకు డబుల్ బెడ్రూం రాలేదు అధికారులు చెప్పాలి.
– ఈర్ల విజయలక్ష్మి, మూడో వార్డు, జగిత్యాల
పేదలకే ఇండ్లు కేటాయించాలి
నేను బీడీలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. లిస్టులో నా పేరు ఉన్నా డబుల్ బెడ్రూం ఇల్లు రాలేదు. ఇప్పటి వరకు మూడు సార్లు దరఖాస్తు చేసుకున్నా. నాకేందుకు రాలేదని అధికారులను అడుగుదామని కలెక్టర్ ఆఫీస్‌లోకి పోదామంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. పేదలకు కాకుండా ఇండ్లు, జాగలు ఉన్నోళ్లకే డబుల్ బెడ్రూం ఇస్తున్నరు. పేదలను గుర్తించి డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలి.
-చదువుల జ్యోతి, మూడో వార్డు, జగిత్యాల