ఎల్ఆర్ఎస్ ఫైళ్ల క్లియర్ విషయంలో కరీంనగర్ నగరపాలక సంస్థ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. గతంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేసేందుకు అధికారులు ప్రయత్నించినా దరఖాస్తుదారులు ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు దరఖాస్తుదారులు క్లియరెన్స్ కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే దిక్కు లేదు. ఎల్ఆర్ఎస్ విషయంలో దరఖాస్తుదారులు తమకున్న సందేహాల నివృత్తి కోసం ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో టౌన్ ప్లానింగ్ విభాగం వద్దకు వస్తే అక్కడ సమాచారం ఇచ్చే వారే కరువయ్యారు. అధికారులెవరు కూడా అందుబాటులో ఉండకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 24 : ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను పరిష్కారంలో అలసత్వం కనిపిస్తున్నది. ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం, బల్దియా ప్రత్యేకాధికారి ఆదేశించినా.. టౌన్ ప్లానింగ్ సిబ్బంది మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నట్టు తెలుస్తున్నది. ఎల్ఆర్ఎస్ కోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పి, కంప్యూటర్ ఆపరేటర్లను అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు.
దరఖాస్తుదారులు వివిధ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు కార్యాలయానికి వస్తే వాటికి సమాధానం ఇచ్చేవారు కరువయ్యారు. ఉన్న కంప్యూటర్ ఆపరేటర్లు, సిబ్బందిని అడిగితే సంబంధిత అధికారులను అడగాలని, వారు సాయంత్రం ఉంటారని చెబుతున్నారు. తీరా సాయంత్రం వస్తే అధికారులు, సిబ్బంది ఆన్లైన్లో చూసుకోవాలంటూ సమాధానాలు ఇస్తున్నారని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు.
పరిశీలన, ఫీజులు.. అంతా గందరగోళం
నగరపాలక సంస్థకు వచ్చిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్లో అత్యధికంగా షాట్ ఫాల్స్ (డ్యాకుమెంట్లు సరిగా లేవు) అన్న కారణంతోనే పెండింగ్లో ఉన్నాయి. దరఖాస్తుదారులు డాక్యుమెంట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేసినా వాటిని టౌన్ ప్లానింగ్ అధికారులు సకాలంలో పరిష్కరించడం లేదన్న విమర్శలున్నాయి. దీంతోపాటు ఒకే ప్రాంతం.. ఒకే విస్తీర్ణంలో ఉన్న స్థలాలకు వేర్వేరుగా ఎల్ఆర్ఎస్ ఫీజులు వస్తుండడంతో దరఖాస్తుదారులు గందరగోళానికి గురవుతున్నారు.
సీతారాంపూర్ ప్రాంతంలోని ఓ ఏరియాలో పక్క పక్కన ఒకే విస్తీర్ణంతో ఉన్న స్థల యజమానులు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా, వారిలో ఒకరికి రూ.వేలల్లో ఫీజు రాగా.. మరొకరికి రూ.లక్షల్లో వచ్చింది. ఇదే విషయాన్ని టౌన్ ప్లానింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే.. సరైన సమాధానం ఇవ్వకుండా ఆన్లైన్లో వస్తే తామేం చేస్తామంటూ చేతులెత్తేశారు. ఆన్లైన్లోనూ అనునిత్యం ఏవో సమస్యలు వస్తూనే ఉన్నాయి. వీటిపై అటు ప్రభుత్వం, ఇటు అధికారులు కూడా దృష్టి పెట్టకపోవడంతో ఈ పథకమే గందరగోళంగా మారింది.
దరఖాస్తుదారుల్లో ఆందోళన
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్ లేకపోవడంపై దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పది రోజుల్లో ప్రొసీడింగ్స్ ఇస్తామని చెప్పినా.. ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ఎప్పుడు క్లియర్ చేస్తారో తెలియక ఆఫీసు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఉన్నతాధికారులెవరూ పట్టించుకోవడం లేదని, టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ విభాగంలోని అధికారులు, సిబ్బంది సాయంత్రమైతే తప్ప కార్యాలయం వైపు చూడడం లేదని ఆరోపిస్తున్నారు. ఫీజు కట్టి క్లియరెన్స్ కోసం ఎన్ని రోజులు ఎదురుచూడాలని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పాలన అంటేనే ఇలా ఉంటుందని, ఒక్క పని కూడా సక్రమంగా పూర్తి కాదని ఆగ్రహిస్తున్నారు.