లోయర్ మానేరు డ్యాం అడుగంటుతున్నది. నీటిమట్టం ఏకంగా 5.706 టీఎంసీలకు పడిపోయింది. డెడ్ స్టోరేజీ 2.096 టీఎంసీలు పోను మిగిలిన 3.610 టీఎంసీలతో మూడు నెలలు గడిచేదెలాగనే ఆందోళన నెలకొన్నది. మిషన్ భగీరథ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 494 ఆవాసాల పరిధిలో ఉన్న 12 లక్షల మంది దాహం తీరుస్తున్న ఈ జలాశయం అడగంటితే రాబోయే మూడు నెలలు తాగునీటికి ఇబ్బంది తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో సోమవారం ఎల్ఎండీని సందర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు, అక్కడి నుంచి ఎల్ఎండీకి నీటిని తరలించి తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 885 ప్రకారం ఎల్ఎండీలో 13 టీఎంసీల నీటిని నిత్యం నిల్వ ఉంచాలని కోరారు.
కరీంనగర్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ) పూర్తి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా, గతేడాది డిసెంబర్ 31 నాటికి 22.870 టీఎంసీల నీరు ఉన్నది. ఈ యేడాది జనవరి ఒకటి నుంచి యాసంగి పంటలకు నీటిని ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేసింది. ఎల్ఎండీ నుంచి 19.578 టీఎంసీలకుతోడు మిడ్ మానేరు ద్వారా 10.996 టీఎంసీలను తరలించి దిగువ ఆయకట్టుకు 30.524 టీఎంసీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. జనవరి ఒకటిన 4 వేల క్యూసెక్కులతో దిగువ ఆయకట్టుకు నీటి విడుదల ప్రారంభించి, 5,500 క్యూసెక్కులకు పెంచారు. నిజానికి ఈ నెల 31 వరకే చివరి తడికి నీటిని విడుదల చేయాల్సి ఉండగా మరో నాలుగైదు రోజుల పాటు 2,500 క్యూసెక్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఖమ్మం, సూర్యాపేట వరకు తరలిస్తున్నారు. అయితే, జలాశయంలో నీటి మట్టం పూర్తిగా పడిపోయింది. సోమవారం నాటికి కేవలం 5.706 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. మిడ్ మానేరు ద్వారా 3 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది. ఈ జలాశయంలోనూ ఆశించిన నీరు లేదు. ఏప్రిల్ 10 వరకు ఇదే స్థాయిలో ఎల్ఎండీకి నీటిని తరలిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ ఎంత వరకు కార్యరూపం దాల్చుతుందనేది అనుమానంగానే ఉన్నది. నిజానికి ఎల్ఎండీ జలాశయం 2.096 డెడ్ స్టోరేజీ కాగా, ఇప్పుడున్న 5.706 టీఎంల్లో డెడ్ స్టోరేజీపోను 3.610 టీఎంసీ నీరు మాత్రమే ఉంటుంది. దీనిని బట్టి చూస్తే వచ్చే మూడు నెలలు తాగునీటికి ఇబ్బందులు తప్పేలా లేవు.
నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ కింద చేసిన ప్రణాళికల ప్రకారంగా ఎల్ఎండీ జలాశయం నుంచి 3 సెగ్మెంట్లకు తాగు నీటిని అందిస్తున్నారు. అందులో కరీంనగర్- రామడుగు సెగ్మెంట్‌ను పరిశీలిస్తే 87, ఎల్ఎండీ, మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్ సెగ్మెంట్ పరిధిలో 312, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి సెగ్మెంట్ పరిధిలో 70 చొప్పున మొత్తం 469 ఆవాసాలు ఉన్నాయి. మున్సిపాలిటీల్లో విలీనమైనవి మరో 25 కలిపి మొత్తం 494 ఆవాసాలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రతి రోజు 143 క్యూసెక్కుల నీరు అవసరం ఉంటుంది. అందులో ఒక్క కరీంనగర్‌కే 63 క్యూసెక్కులు అవసరం. అయితే, ఎల్ఎండీకి యాసంగి నీటి ప్రణాళికలో భాగంగా మిషన్ భగీరథకు 3.852 టీఎంసీలు కేటాయించాలని నిర్ణయించారు. కానీ, ఈరోజు వరకే చూస్తే డెడ్ స్టోరేజీ పోను 3.610 టీఎంసీలు మాత్రమే ఉన్నది. అందులో ప్రతి రోజూ 115 క్యూసెక్కులు ఆవిరి కింద తీసేస్తే తాగు నీటికి లోటు స్పష్టంగా కనిపిస్తున్నది. దీనికి తోడు మరో నాలుగైదు రోజులు దిగువ ఆయకట్టుకు సాగు నీటిని సరఫరా చేస్తే జలాశయంలో మరింత నీటి మట్టం పడిపోయి తాగు నీటికి తీవ్ర ఇక్కట్లు తప్పవనేది స్పష్టమవుతున్నది.
కరీంనగర్‌తోపాటు 494 అవాసాల పరిధిలో ఉన్న 12 లక్షల మంది దాహం తీర్చే ఎల్ఎండీ జలాశయంలో నీటి మట్టం పూర్తిగా పడిపోతున్నదని నీటి పారుదల శాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ విషయాన్ని సోమవారం ఎల్ఎండీని సందర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించుకోని కారణంగా ఇప్పుడు ఎల్లంపల్లిలో, దానిపై ఆధారపడిన మధ్యమానేరులోనూ ఆశించిన నీరు లేదని, ఎల్ఎండీకి ఎలా తరలిస్తారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. నిజానికి ఎల్ఎండీలో 905.18 అడుగుల లెవల్లో 13.156 టీఎంసీల నీటిని నిత్యం నిల్వకు ఉంచాలని 2017 అక్టోబర్ 30న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నంబర్ 885ను జారీ చేసింది. ఎల్ఎండీ దిగువ ప్రాంతంలో ఎక్కడ ఎలాంటి సమస్య ఎదురైనా ఈ నీటిని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చిన ఈ జీవోను ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కింది. నీటి లభ్యత ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోయకుండా ఇటు సాగునీటికి, అటు తాగునీటికి ఇబ్బందులు పడే పరిస్థితి కొని తెచ్చుకున్నదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎల్ఎండీ నీటి మట్టం పడిపోతే కరీంనగర్‌కు తాగునీటి సమస్యలు తలెత్తుతాయని మున్సిపల్ ఉన్నతాధికారులు నీటి పారుదల శాఖకు పలుసార్లు లేఖల ద్వారా విన్నవించినట్టు తెలుస్తున్నది. ఇదే విషయాన్ని ఇరిగేషన్ అధికారులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తాగునీటి అవసరాలకు నీటిని నిల్వ చేయాల్సిన అవసరం ఉందని సూచించినట్టు తెలిసింది. అయినా, డెడ్ స్టోరేజీ వరకు దిగువ ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంతో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొన్నది.