జగిత్యాల జిల్లాలో చిత్తుబొత్తు జోరుగా సాగుతున్నది. ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో గల అటవీప్రాంతాలు, గుట్టబోర్లు కేంద్రాలుగా నడుస్తున్నది. కార్లు, జీపులు, భారీ వాహనాలు పోవడానికి వీలు లేని కేవలం రెండు వైపులా తోవ ఉన్న గుట్టబోరు, అటవీ ప్రాంతాన్ని జూదరులు ఎంచుకుంటున్నారు.
సమాచారం చేరవేత కోసం ఆట కేంద్రానికి మూడంచెల్లో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పోలీసులు, ఇతరు లు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తే నిర్వాహకులకు సెల్‌ఫోన్ ద్వారా సమాచారం చేరే లా, ఆ తర్వాత మరో మార్గంలో పారిపోయేలా ముందే ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఆట స్థావరాన్ని కూడా మార్చేస్తూ, నిత్యం రూ.లక్షల్లో జూదం ఆడుతున్నారు.
జగిత్యాల, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ)/జగిత్యాల కలెక్టరేట్ : చిత్తుబొత్తు కేంద్రాల్లో రోజుకు 30 లక్షల నుంచి 40 లక్షల వరకు జూదం జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఆటకు అలవాటు పడిన జూదరులకు నిర్వాహకులు మధ్యాహ్నం ఆట జరిగే స్థలం వివరాలను ఫోన్‌ద్వారా చేరవేస్తున్నారు. ఆడేవారు మధ్యాహ్నం మూడు, నాలుగు గంటల ప్రాంతంలో చేరుకుంటున్నారు. వీరేశం చెప్పిన ప్రకారం చూస్తే రోజుకు 70 నుంచి 80 మంది జూదరులు ఆటకు హాజరవుతున్నారు.
చిత్తుబొత్తులో పాల్గొనే వారు ఆటకు 100 చొప్పున నిర్వాహకులకు ఎంట్రీ ఫీజు చెల్లించాలి. ఒక వ్యక్తి రూపాయి నాణెం ఎగురవేసి ఎడమ అరచేతిలో మూస్తాడు. బొమ్మ (చిత్తు) చెప్పేవారు.. బొరుసు(బొత్తు) చెప్పేవారు తమ బెట్టింగ్ మొత్తాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఇద్దరు వ్యక్తులకు అందజేస్తారు. ఇలా వెయ్యి నుంచి 5 వేల వరకు డబ్బులు పందెం కాస్తున్నారు. కొద్దిసేపటి తదుపరి నాణెంను మూసిన వ్యక్తి దానిపై నుంచి చేతిని తొలగిస్తాడు. బొమ్మ పడితే.. బొరుసుపై పందెం కాసిన వారు పెట్టిన డబ్బులన్నింటినీ బొమ్మపై పందెం కాసిన వారి లెక్క ప్రకారం వారికి అందజేస్తారు. ఇలా ఆట మూడు నుంచి నాలుగు గంటల పాటు కొనసాగిస్తున్నారు. సాయం త్రం ఆరున్నర ఏడు గం టల ప్రాంతంలో ఆట ఆపేస్తున్నారు.
వీరేశం (పేరు మార్చబడింది) 50 ఏండ్ల వయసున్న వ్యాపారి. మల్యాల మండలానికి చెందిన ఆయన దాదాపు పాతికేండ్ల క్రితమే వ్యాపారం కోసం జగిత్యాల పట్టణానికి మకాం మార్చాడు. అయితే, మొదటి నుంచి వీరేశం పేకాట ఆడేవాడు. 15 ఏండ్ల క్రితం మల్యాల మండల పరిధిలోని ఓ నాయకుడు అక్కడి అటవీప్రాంతంలో నిత్యం నిర్వహించే పేకాట కేంద్రాలకు వెళ్లి ఆడేవాడు. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పేకాట, జూదంపై ఉక్కుపాదం మోపడంతో మల్యాల అటవీ ప్రాంతాల్లోని పేకాట స్థావరాలకు సదరు నాయకుడు ముగింపు పలికాడు.
దాదాపు ఏడాది క్రితం ప్రభుత్వం మారడంతో మళ్లీ జూదం మొదలైంది. అయితే, గతంలో పేకాటను ఎంచుకున్న నిర్వాహకులు ఈసారి కొత్తగా చిత్తుబొత్తు ఆడిస్తున్నాడు. ఈ క్రమంలోనే జగిత్యాల జిల్లా, ప్రధానంగా ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని అటవీప్రాంతంలో గుట్టుగా సాగుతున్న ఈ ఆట గురించి వీరేశం తెలుసుకున్నాడు. దసరా పూట పెగడపల్లి మండల శివారులో రహస్యంగా ఆట నిర్వహిస్తున్న స్థావరానికి వెళ్లాడు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆడి, 50 వేలు పోగొట్టుకొని ఇంటికి చేరుకున్నాడు. పెద్దమొత్తంలో డబ్బులు పోవడంతో పండుగపూట నిరాశలో మునిగిపోయాడు. దగ్గరిమిత్రులతో చెప్పుకొని బోరుమన్నాడు.
చిత్తుబొత్తు ఆట నిర్వాహకులు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఫోన్‌పే, గూగుల్‌పేకు అవకాశం లేదని చెబుతున్నారు. ఆటలో పాల్గొనే వారు కచ్చితంగా నగదు మాత్రమే పెట్టాలి. లేదంటే నగదు తీసుకురాని వారి కోసం కమీషన్‌పై నగదు ఇచ్చే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. దీనికోసం 10 లక్షల నుంచి 15 లక్షల నగదుతో ఆట స్థావరం వద్ద నిర్వాహకులు తమ మనుషులను ఉంచుతున్నారు. 50 వేలు గూగుల్‌పే చేసిన వ్యక్తికి 45 వేల నగదు అందజేసి, 5 వేలు కమీషన్‌గా వసూలు చేస్తున్నారు. ఆడేవారి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని స్విచ్చాఫ్ చేస్తున్నారు. ఆట సమాచారం బయటకు పొక్కకుండా చూసుకుంటున్నారు.
చిత్తుబొత్తు నిర్వాహకులు ఆట విషయం బ యటకు పొక్కకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. మద్యం తాగిన వారు డబ్బులు పోగొట్టుకుంటే ఆ మ త్తులో వీరంగం వేసే అవకాశమున్నది. ఇది ఆటకు అంతరాయం కలిగిస్తుందని, విష యం బయటికి వస్తుందనే కారణంతో మద్యం తాగి న వారిని ఏమాత్రం అనుమతించడం లేదు.
చిత్తుబొత్తు ఆటలో నిర్వాహకులు పెద్ద మొ త్తంలో లాభాలు పొందుతున్నట్లు తెలుస్తున్న ది. గూగుల్‌పే, ఫోన్‌పే కమీషన్‌తోపాటు చిత్తుబొత్తు వేసే వ్యక్తి కోసం ఆటలో పాల్గొన్న వ్యక్తి నుంచి వంద వసూలు చేస్తున్నారు. అలాగే, ఒకసారి నాణెంను పైకి వేసి, తెరిస్తే ఒక్క ఆట అవుతుంది. ఈ ఆటలో పాల్గొన్నవారు పెట్టిన మొత్తంలో 10 శాతం నిర్వాహకులు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది.
అంటే ఒక్క ఆటకు లక్ష బెట్టింగ్ జరిగితే అందులో నుంచి పది వేలు నిర్వాహకులు తీసుకుని, 90 శాతం నగదును బెట్టింగ్ కాసి గెలిచిన వ్యక్తులకు పంపిణీ చేస్తున్నారు. ఈ లెక్క ప్రకారం రోజూ 30 లక్షల నుంచి 40 లక్షల వరకు ఆట సాగితే 3 లక్షల నుంచి 4 లక్షలు నిర్వాహకులు తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. అయితే, రెండు నెలల నుంచి చిత్తుబొత్తు జూదం జోరుగా నడుస్తున్నా, ఇంత వరకు బయటకు పొక్కకపోవడం, పోలీసుల దృష్టి పడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.