వేములవాడ, నవంబర్ 5: ‘తక్కువ ధరకే అలంకరణ వస్తువు’ అంటూ ఎరవేసిన సైబర్ నేరగాళ్ల వలకు ఓ మహిళ చిక్కింది. ఆశకు పోయి ఆన్లైన్లో లక్షకుపైగా పోగొట్టుకున్నది. వివరాల ప్రకారం.. వేములవాడకు చెందిన ఓ మహిళ, సోషల్ మీడియాలో కేవలం రూ. 999కే అలంకరణ వస్తువు అంటూ పెట్టిన పోస్ట్‌ను చూసి, ఆకర్శితురాలైంది. తర్వాత సైబర్ నేరగాళ్లు ఇచ్చిన నంబర్‌కు నగదును జమ చేసింది. ట్రాన్స్‌పోర్టు కోసం మరో రూ.150 జమ చేయాలని చెప్పడంతో ఆ మొత్తాన్ని కూడా పంపింది.
తర్వాత అలా కాకుండా మొత్తం కలిపి మరీ పంపాలని చెప్పగా.. మరోసారి రూ. 1149 ఫోన్‌పే ద్వారా చేసింది. అప్పుడు తేరుకున్న సదరు మహిళ.. ‘ముందు కట్టిన నగదు ఎవరిస్తారంటూ వాట్సాప్‌లో చాటింగ్ మొదలు పెట్టింది. దాంతో సైబర్ నేరగాడు వీడియో కాల్ ద్వారా ఆన్‌లైన్‌లోకి రమ్మని చెప్పడంతో.. వెంటనే వీడియో కాల్ చేసింది.
తర్వాత సూచనలు చేస్తూ తిరిగి నగదు వచ్చే వివరాలను వెల్లడిస్తామని చెప్పడంతో నమ్మింది. ఈ క్రమంలో మొత్తం ఫోన్‌ను తన స్వాధీనంలోకి తీసుకొని సుమారు రూ.లక్షా 15 వేలకుపైగా నగదును కాజేయడంతో మోసపోయానని గ్రహించింది. తర్వాత వేములవాడ పోలీసులను ఆశ్రయించింది. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు వేములవాడ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు ఆలస్యంగా తెలిసింది.