హుజురాబాద్ రూరల్, జూన్ 5: హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామ శివారులోని కాకతీయ కాలువ బ్రిడ్జ్ వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి (Road Accident). ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ మరణించారు. గురువారం తెల్లవారుజామున వరంగల్-కరీంనగర్ జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో లారీ డ్రైవర్ కృష్ణ కిషోర్ (44)క్యాబిన్లో ఇరుక్కొని గంట సేపు నరకయాతన అనుభవించాడు. గ్రామస్తులు గంటన్నర పాటు తీవ్రంగా శ్రమించి క్యాబిన్లో ఇరుక్కున్న అతన్ని బయటకు తీశారు.
108 అంబులెన్స్‌లో దవాఖానకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో డ్రైవర్ మరణించాడు. దీంతో డ్రైవర్ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. గాయపడ్డ లారీ క్లీనర్ మస్తాన్‌కు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, లారీ డ్రైవర్ ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం జయ్యారం వాసిగా తెలుస్తుంది. పోలీసులు సకాలంలో స్పందించకపోవడంతోనే లారీ డ్రైవర్ చనిపోయాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. లారీ ప్రమాదంతో కరీంనగర్-వరంగల్ హైవేపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.