కనులపండువలా విగ్రహాలకు క్షీరాధివాస వేడుక
ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత దంపతులు
వేడుకలకు హాజరైన రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
జగిత్యాల, జూన్ 6 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూరు గ్రామంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తున్నది. దేవనపల్లి వంశీయుల ఇలవేల్పు శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నూతన ఆలయ ప్రారంభోత్సవంలో భాగంగా విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు సోమవారం కార్యక్రమంలో గర్భగుడిలో ప్రతిష్ఠించే విగ్రహాలకు క్షీరాధివాసం నిర్వహించారు. పాంచరాత్రాగమ శాస్త్ర నియమాల ప్రకారం దాదాపు 12 లీటర్ల ఆవుపాలతో క్షీరాధివాసం నిర్వహించారు.
వేలాది మంది భక్తులు హాజరై కార్యక్రమాన్ని తిలకించారు. ఈ క్షీరాధివాసం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, డీఆర్ అనిల్ కుమార్ దంపతులు, నవత రామ్ కిషన్ రావు దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఉదయం నుంచి జరిగిన కార్యక్రమాల్లో నివేదన, మంగళాశాసనం, శాత్తుమోరె, ద్వారా తోరణ ధ్వజ కుంభారాధన, చతుస్థానార్చన, అగ్నిముఖం, హవనం, నయన ఉన్మీలనం పంచ సూక్త పరివార ప్రాయశ్చిత్త హవనం, మంగళాశాసనం తీర్థ ప్రసాదగోష్ఠి నిర్వహించారు. అంతకుముందు లోహమయ, శిలామయ మూర్తి ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కుంభాభిషేకం, విగ్రహాల జలాధివాసం కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కలెక్టర్ సీ నారాయణ రెడ్డి దంపతులు, శాసనమండలి సభ్యులు రఘోత్తమ రావు, పూల రవీందర్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.