చిగురుమామిడి, జనవరి 06 : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన లోకిని శ్రీనివాస్ కాకతీయ యూనివర్సిటీలో డాక్టర్ పొందాడు. ‘ఖమ్మం జిల్లాలో గిరిజన మహిళ సాధికారత ఒక అధ్యయనం’ అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించినట్లు కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు. రాజనీతి శాస్త్ర విభాగం ప్రొఫెసర్ జి. వీరన్న పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశాడు.
అలాగే పలు జాతీయ, అంతర్జాతీయ సెమినార్ లో పాల్గొని పరిశోధన పత్రాలను సమర్పించారు. తెలంగాణ మలి దశ, ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కేయూ జేఏసీ నిర్వహించిన మహా పాదయాత్రలో శ్రీనివాస్ కీలక పాత్ర పోషించాడు. శ్రీనివాస్ కు డాక్టరేట్ ప్రధానం పట్ల యూనివర్సిటీ ప్రొఫెసర్లు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.