పార్లమెంట్ ఎన్నికల నగరా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఏడు విడుతల్లో ఎలక్షన్లు ఉండనుండగా, రాష్ట్రంలో నాలుగో విడుత జరుగనున్నాయి. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ రానుండగా, మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉండనుండగా, షెడ్యూల్ విడుదలతో అప్పుడే రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే బీఆర్ఎస్ కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించి, కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ వేదికగా శంఖారావం పూరించగా, శ్రేణులు నూతనోత్సాహంతో ముందుకెళ్తున్నాయి.
కరీంనగర్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. నాలుగో విడుతలో మన రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించనుండగా, వచ్చే నెల 18న నోటిఫికేషన్ ఇవ్వనున్నది. అదే రోజు నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మే 13న పోలింగ్ నిర్వహించి, జూన్ 4న ఓట్లు లెక్కించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి కరీంనగర్, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు జాబితాను వెల్లడించారు. రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎం మిషన్లను పరిశీలించారు. ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కొద్ది రోజుల నుంచే రాజకీయ వేడి రాజుకుంటున్నది. తాజాగా షెడ్యూల్ విడుదలతో ఒక్కసారిగా మరింత వేడెక్కింది. అన్ని పార్టీల కంటే ముందుగానే బీఆర్ఎస్ కరీంనగర్, పెద్దపల్లి అభ్యర్థులను ప్రకటించింది. ఇదే కరీంనగర్ వేదికగా లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. అనంతరం బీజేపీ కూడా తమ పార్టీ అభ్యర్థులుగా కరీంనగర్‌కు బండి సంజయ్‌ని, పెద్దపల్లికి గోమాస శ్రీనివాస్‌ను ప్రకటించింది. కానీ, కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు ఎవరినీ ప్రకటించలేదు. అసలు పోటీలో ఎవరిని దింపుతారనేది స్పష్టత రాలేదు. అభ్యర్థుల విషయంలో ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తున్నది.
కాంగ్రెస్ సర్కారు తీరుపై ఇప్పటికే ప్రజల్లో అసహనం వ్యక్తమవుతున్నది. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు సాగు, తాగునీటికి కష్టాలు మొదలు కావడం, వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోవడంతో ఆగ్రహం కనిపిస్తున్నది. ఇప్పటికే రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. ఇటు ఎన్నికల ముందు ఆ పార్టీ 420కి పైగా హామీలిచ్చి మభ్యపెట్టిందని, వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కొన్నింటినే ఇచ్చిందని ప్రజలు మండిపడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రజల పక్షాన నిలుస్తున్నది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ఏం చేస్తాయో తెలియని పరిస్థితి ఉండగా, పార్లమెంట్లో తెలంగాణ గొంతుక ఉండాలని భావిస్తున్నది. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే అన్ని పార్టీల కంటే ముందే ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల 4నే మాజీ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు కరీంనగర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు పెద్దపల్లి టికెట్లు కేటాయించింది. ఉద్యమకారులు, సమర్థులు, సీనియర్ నాయకులైన వీరిద్దరికి అవకాశం కల్పించడంతో శ్రేణుల్లో హర్షం వ్యక్తమైంది.
అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తనకు కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ నుంచే శంఖారావం పూరించారు. ఈ నెల 12న ఎస్సారార్ కళాశాల మైదానం వేదికగా కదనభేరి మోగించి, పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణుల్లో సమరోత్సాహం కనిపిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటూనే లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాలను కైవసం చేసుకునే దిశగా గులాబీదళం అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ఈ రెండు నియోజవర్గాల పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్లు, మండలాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ.. నాయకులు దిశానిర్దేశం చేశారు.
కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి కేడర్‌కు అందుబాటులో ఉంటున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో కలిసి మంతనాలు జరుపుతూ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. అబద్ధాలు, మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తీరును, వైఫల్యాలను వివరిస్తున్నారు. పార్లమెంట్లో తెలంగాణ సోయి, ప్రజలపై ప్రేమ ఉన్న వ్యక్తులను గెలింపించుకోవాలని కేసీఆర్ పిలుపు ఇవ్వగా.. ఆ మేరకు ప్రతి కార్యకర్త నూతనోత్తేజంతో ముందుకు సాగుతున్నారు.
షెడ్యుల్ విడుదలైన మరుక్షణం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇది ఎన్నికల ప్రక్రియ ముగిసే నాటికి అంటే.. జూన్ 6వ తేదీ దాకా కొనసాగనున్నది. శనివారం రాత్రి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, కోడ్ పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లాల ఎన్నికల అధికారులు (కలెక్టర్లు) ప్రకటనలు జారీ చేశారు. అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, కోడ్ పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని చెప్పారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విధిగా పాటించాలని సూచించారు. ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూం, చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆదివారం నుంచి ప్రత్యేక బృందాలు విధులు నిర్వహిస్తాయని తెలిపారు.