chigurumamidi | చిగురుమామిడి, ఏప్రిల్ 23: ప్రతీ యేటా పశువులు, ఇతర జీవాలు వందల సంఖ్యలో వివిధ రకాల వ్యాధులతో మృతి చెందుతున్నాయి. పశువుల మరణాలను అరికట్టేందుకు ప్రతి ఏటా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నెలరోజుల పాటు మండలంలో చేపట్టనున్నారు. పశువులకు సోకే వ్యాధులపై పాడిపశువులకు అవగాహన కల్పించి సకాలంలో నివారణ టీకాలు వేయించారని అధికారులు భావిస్తున్నారు. మండలంలోని 17 గ్రామాలలో 7000 కు పైగా పశువులు ఉన్నాయి.
పశువుల వ్యాధి లక్షణాలు ఇలా గుర్తించాలి
గాలికుంటు వ్యాధి సూక్ష్మ క్రీములతో వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన గేదెలు, ఆవులు 24 గంటల్లో బక్క చిక్కి అల్సర్ బారిన పడతాయి. 2 నుండి 6 రోజుల వరకు జ్వరం ఎక్కువగా ఉంటుంది. నోరు, పెదాలు, నాలుక చన్నులతోపాటు గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి వ్యాధి ముదురుతుంది. వ్యాధి బారిన పడిన పశువులు ముడుచుకొని పడుకుంటాయి. మేతకు నీళ్లకు దూరంగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తి తగ్గడంతో పశువులు, దూడలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. గాలికుంటు వ్యాధి సోకితే అలసత్వం చేయకుండా జాగ్రత్తలు చేపట్టాలి. ఎప్పటికప్పుడు పశువులపాకును శుభ్రంగా ఉంచాలి. వారానికి ఒకసారి కొట్టంలో సున్నం చల్లి క్రిమికటకాలు నివారణ చర్యలు తీసుకోవాలి. వ్యాధి సోకిన గేదె, ఆవు నుంచి తీసిన పాలను వంద డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేసిన తర్వాత తాగాలి. పశువులు చనిపోతే గోతిలో వేసి బ్లీచింగ్ పౌడర్ చల్లి పాచిపెట్టాలి.
సద్వినియోగం చేసుకోవాలి
– సాంబరావు, పశువైద్యాధికారి, ఇందుర్తి
రైతులు పశువులు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలి. ఈనెల రెండవ వారం నుండి గాలికుంటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాలు మండలంలో చేపట్టడం జరిగింది. ఇప్పటివరకు మండలంలో నాలుగు గ్రామాల్లో గాలికుంటు వ్యాధి టీకాలను పశువులకు వేయడం జరిగింది. షెడ్యూల్ ప్రకారం అన్ని గ్రామాలలో పశువులకు ఉచితంగా టీకాలు వేస్తున్నాం. రైతులు సద్విని చేసుకోవాలి. టీకాలు వేయించడం ద్వారా పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. మేకలు, గొర్రెలు, పశువులకు ఎలాంటి వ్యాధులు సోకిన పశు ఆరోగ్య సిబ్బందికి సమాచారం అందించాలి. ప్రతి ఏటా రెండుసార్లు ఉచితంగా టీకాలు పశువులకు పంపిణీ చేయనున్నాం.