Peddapally | పెద్దపల్లి, అక్టోబర్23: ఉద్యోగ విరమణ పొంది ఏడాదిన్నర దాటిన బెనిఫిట్స్ రాకా రిటైర్డ్ ఉద్యోగుల బతుకులు ఆగమవుతున్నయ్.. జర మమ్మల్ని పట్టించుకోండని రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ (రేవా) ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిశాల ప్రభాకర్ రావు అవేదన వ్యక్తం చేశారు. 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు ఉద్యోగ విరమణ చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రయోజనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రేవా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో గురువారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రావు మాట్లాడుతూ, ఏడాదిన్నర కాలంగా ఉద్యోగ విరమణ చెందిన ఉద్యోగులకు రావలసిన జీపీఎఫ్, జీఐఎస్, లీవ్ ఎన్కాష్మెంట్, కమ్యూటేషన్, గ్రాట్యూటీ అందలేదని వాపోయారు.
చివరి చరమాంకంలో ఆనందంగా గడపాల్సిన సమయంలో బకాయిల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపరించిందని అవేదన చెందారు. పెన్షనర్ల బకాయిలు ఇవ్వాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఉమ్మడి జిల్లా కోశాధికారి కనపర్తి దివాకర్ మాట్లాడుతూ, ఉద్యోగ విరమణ బకాయిలు వచ్చేంత వరకు పోరాటం చేస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తామని చెప్పారు. బకాయిలు అందక ఇప్పటి వరకు రాష్ట్రంలో 18 మంది దాకా చనిపోయారని, మానసిక వేదనతో చాలా మంది అనారోగ్యాలతో దవాఖానల్లో ఉన్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
అనంతరం కలెక్టరేట్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జల్ద అరుణ శ్రీకి వినతి పత్రం సమర్పించి, తమ సమస్యలను ముఖ్యమంత్రికి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కన్వీనర్ కే సత్యనారాయణ, గండ్ర రవీందర్ రావు, చింతల రవీందర్ రెడ్డి, గోగుల రామన్న, కే వెంకట్రాములు, లక్ష్మీనారాయణ, వంగ సుధాకర్, విజయరాణి, రమాదేవి, కరుణాకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, రాజు, దామోదర్ రెడ్డి, నారదాసు ప్రభాకర్, మహేందర్ రెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.