మానకొండూర్ రూరల్, ఫిబ్రవరి 23 : ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే స్పెషల్.. ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా ఒక్క బాల్ మిస్‌కాకుండా టీవీలకు అతుక్కుపోవాల్సిందే.. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ ఉండడం.. మరోవైపు పెళ్లిళ్లు అధికంగా ఉండడంతో బంధువులు, మిత్రులు వస్తారో.. రారో అనుకుని.. వచ్చినా ఎక్కువ సమయం ఉంటారో.. లేదోనని పెళ్లివారు మండపాల్లో స్క్రీన్లు ఏర్పాటు చేసి మ్యాచ్‌ను లైవ్ టెలీకాస్ట్ చేశారు.
మానకొండూర్ మండలం వేగురుపల్లి గ్రామంలో బత్తిని స్వరూప-వీరస్వామి గౌడ్ దంపతుల కూతురు వివాహం జరుగగా, అదే వేడుకల్లో ఏర్పాటు చేసిన స్క్రీన్‌లో ఓ వైపు పెండ్లి తంతు, మరో వైపు క్రికెట్ మ్యాచ్‌ను స్క్రీన్ పై వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. హాజరైన బంధువులు, గ్రామస్తులు సైతం ఆసక్తిగా తిలకించారు.