ఉమ్మడి జిల్లాకు దసరా కిక్కెక్కింది. మద్యం ప్రవాహం కట్టలు తెంచుకున్నది. పండుగ సందర్భంగా విక్రయాలు జోరందుకొని ఏరులై పారింది. వైన్స్ షాపులతోపాటు ఊరూవాడా ‘బెల్టులై’ పారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మందుబాబులను ‘ఫుల్లు’గా తాగించి, వారి జేబులను ఖాళీ చేయించి సర్కారు భారీ ఆదాయాన్నే మూటగట్టుకున్నది. నాలుగురోజుల్లోనే రికార్డు స్థాయిలో 59.46 కోట్లు సమకూర్చుకున్నది.
కరీంనగర్, అక్టోబర్ 14(నమస్తే తెలంగాణ): ఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. దసరా పండుగకు తెగ కిక్కించాయి. ఒకప్పుడు రెవెన్యూ విభాగంలో ఓ భాగంగా ఉన్న ఎక్సైజ్ శాఖ, ఇప్పుడు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారిందనేందుకు పెరుగుతున్న విక్రయాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. మొత్తం 290 మద్యం దుకాణాలు, 63 బార్ అండ్ రెస్టారెంట్లు ఉండగా, ప్రధానంగా జిల్లాకేంద్రాలతోపాటు గోదావరిఖని, మంథని, హుజూరాబాద్, కోరుట్ల, వేములవాడ ప్రాంతాల్లో అమ్మకాలు జోరుగా సాగాయి. వీటికితోడు బెల్టుషాపుల ద్వారా మద్యం ఏరులైపారగా, భారీ ఆదాయమే లక్ష్యంగా ఎక్సైజ్ అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ విక్రయాలు జరిగేలా చూసినట్టు తెలుస్తున్నది. మొత్తంగా దసరా పండుగ సందర్భంగా నాలుగు రోజుల్లోనే 59.46కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
జిల్లాల వారీగా చూస్తే కరీంనగర్ జిల్లాలో గతేడాది దసరా సందర్భంగా నాలుగు రోజుల్లో 17,274 లిక్కర్లు కాటన్లు, 60,655 బీర్లు కాటన్ల విక్రయం ద్వారా 22.97 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం నాలుగు రోజుల్లోనే 28,363 లిక్కర్ కాటన్లు, 67,595 బీర్ల కాటన్ల విక్రయం ద్వారా 33.52 కోట్ల ఆదాయం వచ్చింది. పెద్దపల్లి జిల్లాలో గతేడాది 9,283 లిక్కర్ కాటన్లు, 16,113 బీరు కాటన్లు అమ్మగా 9.98కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం 12,343 లిక్కర్ కాటన్లు, 22,414 బీర్ల కాటన్ల విక్రయాలతో 12.58 కోట్లు వచ్చాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతేడాది 4,072 కాటన్ల లిక్కర్, 9,940 కాటన్లు బీర్ల విక్రయంతో 4.82కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ప్రస్తుతం 4,286 కాటన్ల లిక్కర్, 10,636 కాటన్ల బీర్లు విక్రయించడంతో 5.14కోట్ల ఆదాయం వచ్చింది. జగిత్యాల జిల్లాలో గతేడాది 1,687కాటన్ల లిక్కర్, 7,076 కాటన్లు బీర్లు అమ్మగా 2.52కోట్ల ఆదాయం చేకూరింది. ప్రస్తుతం 6,618 కాటన్ల లిక్కర్, 19,114 కాటన్లు బీర్లు విక్రయించడంతో 8.22కోట్ల ప్రాఫిట్ చేకూరింది. మొత్తంగా గతేడాదితో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో 30.35 కోట్ల ఆదాయం పెరిగిందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో చాలా వరకు గుడుంబాను నియంత్రణలోకి తెచ్చాం. ఈ క్రమంలో మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం సమకూరుతున్నది. గతేడాదితో పోలిస్తే మద్యం అమ్మకాలు బాగా పెరిగాయి.