Ramagundam | కోల్ సిటీ, ఆగస్టు 21: రామగుండం నగర పాలక సంస్థలో విద్యుత్ వినియోగం దుబారా అవుతోంది. వీధి దీపాల నిర్వహణ గాడి తప్పుతోంది. వివిధ డివిజన్లలో పగటి పూట దీపాలు వెలిగి రాత్రి పూట వెలగక అంధకారం నెలకొంటోంది. గత మూడు రోజులుగా నగర పాలక సంస్థ 35వ డివిజన్ లో పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ఆ డివిజన్ పరిధిలోని సిమ్స్ మెడికల్ కళాశాల ప్రక్కన రాజ్యలక్ష్మీ కాలనీలో పట్టపగలే వీధి లైట్లు వెలుగుతున్నా కార్పొరేషన్ సంబంధిత విభాగం అధికారుల పర్యవేక్షణ కొరవడింది. విద్యుత్ ను వృథాగా వాడటం వల్ల నెలనెలా బిల్లులు తడిసిమోపెడు అవుతున్నా అధికార యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తోంది.
కాగా, పగలు వీధి లైట్లు వెలగడం పెద్ద సమస్య కాకపోయినా.. అవే వీధి లైట్లు రాత్రి పూట వెలగకపోవడంతో అంతా చీకటి మయంగా ఉంటోందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో కాలనీ నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. ఈవిషయమై నగర పాలక సంస్థ ఎలక్ట్రికల్ విభాగం దృష్టికి తీసుకవెళ్లినా స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. రాత్రి పూట వాహనాల లైట్లు లేదంటే సెల్ ఫోన్ టార్చ్ వెలుతురులోనే రాకపోకలు సాగిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు గురవుతున్నట్లు వాపోతున్నారు. కాగా, అధికారుల పర్యవేక్షణ కొరవడి విద్యుత్ దుబారాతో బల్దియా ఆదాయంకు గండి పడుతోంది. పలు డివిజన్లలో ఇదే పరిస్థితి నెలకొంటుంది. ఐనా అధికార యంత్రాంగం విద్యుత్ వినియోగం దుబారాను అరికట్టాలని మాత్రం ఆలోచన చేయడం లేదు. పగటిపూట వెలుగులు ఖజానాకు భారంగా మారుతున్నా పట్టించుకోవడం లేదు. దీనితో నెలనెలా విద్యుత్ బిల్లుల బకాయిలు పేరుకుపోతున్నాయి. ఎలక్ట్రికల్ విభాగంపై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు వస్తున్నా చర్యలు తీసుకోని కారణంగానే నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా నగర పాలక సంస్థ కమిషనర్ స్పందించి ఎలక్ట్రికల్ విభాగంను గాడిలో పెట్టాలని రాజ్యలక్ష్మీ కాలనీ వాసులు కోరుతున్నారు.