Geekuru Ravinder | చిగురుమామిడి, నవంబర్ 28 : సంఘసంస్కర్త పూలే ఆశయ సాధన కోసం అందరం కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గీకురు రవీందర్ అన్నారు. బీసీ సంక్షేమ సంఘం గ్రామ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 135వ వర్ధంతి కార్యక్రమాన్ని మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. పూలే దంపతుల విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గీకురు రవీందర్ మాట్లాడుతూ దేశములో మొట్టమొదటి సామాజిక తత్వవేత్త, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిభా పూలే ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కుల వివక్షతపై పోరాడాలని, బడుగు బలహీన వర్గాల్లో జ్ఞాన సంపద నింపి సామాజిక చైతన్యులను చేయాలని నిశ్చయించుకున్నాడని అన్నారు. సమాజంలో సగ భాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని ఫూలే భావించాడన్నారు. స్త్రీలు విద్యావంతులు కావాడానికి ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపి ఆమె ద్వారా మహిళలకు విద్యాభ్యాసం ప్రారంభించారు. తన ఆశయ సాధనలో ఎన్ని అవమానాలు, అవరోధాలు ఎదురైనా గానీ వెనుకడుగు వేయలేదన్నారు.
బ్రహ్మనీయ కుల వ్యవస్థలో దోపిడీకి, అణిచి వేతకు, కుల వివక్షతకు గురవుతున్న బడుగుల బ్రతుకుల్లో వెలుగు నింపుటకు తన జీవితాన్ని, కుటుంబాన్ని త్యాగం చేసిన త్యాగశీలి యని కొనియాడారు. ప్రస్తుతం దేశములో ఉన్న సామాజిక, ఆర్థిక అసమానతలను తొలిగించి సమాజంలో అందరు స్వేచ్చ, సమానత్వం పొందుటకు మహాత్ముని ఆదర్షాలను అనుసరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం గ్రామ శాఖ అద్యక్షుడు సుదగొని రాజు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్, కానవేని శివకుమార్, బుర్ర సంపత్, సుదగొని రామచంద్రం, బెజ్జంకి అంజయ్య, చీముర్తి నర్సయ్య, పత్తెము సమ్మయ్య, నాంపెల్లి తిరుపతి, సుదగోని వీరాస్వామీ, బుర్ర శ్రీలత తదితరులు పాల్గొన్నారు.