Drug-free society | ఓదెల, ఆగస్ట్ 16 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కాపల్లి గ్రామంలో మాదకద్రవ్య దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని పోత్కపల్లి పోలీసులు శనివారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. నాషా ముక్త్ భారత్ అభియాన్-2025 లో భాగంగా మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై దీకొండ రమేష్ మాట్లాడుతూ మాదకద్రవ్య దుర్వినియోగం లేని సమాజాన్ని నిర్మించడానికి ఐక్యంగా పోరాడదామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలన, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా తీసుకుంటున్న చర్యలలో భాగంగా మాదకద్రవ్య దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ లక్ష్యంతో దేశవ్యాప్తంగా నాషా ముక్త్ భారత్ అభియాన్ (NMBA)ను అమలు చేస్తోందని తెలిపారు.
పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా సరఫరా, సాగుచేసినా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘నేను మాదక ద్రవ్యాల పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ, నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని, నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతాను’ అని ప్రతిజ్ఞ చేయించారు.