Godavarikhani | కోల్ సిటీ, సెప్టెంబర్ 7: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ ను తిప్పికొడదామని టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు కే. సూర్యం పిలుపునిచ్చారు. ఈమేరకు గోదావరిఖనిలో ఆదివారం టీయూసీఐ పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఆయన ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తుందనీ, 29 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్స్ ను ఆమోదించిందని తెలిపారు.
పని గంటల పెంపు కార్మిక వర్గంకు అత్యంత ప్రమాదకరంగా ఉందన్నారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 12 గంటల పని 282 జీవోను అమలులోకి తీసుకవచ్చిందని, రేవంత్ ప్రభుత్వం మోడీ విధానాలను ఆమోదించడం సరైంది కాదన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ చట్టాలను యాజమాన్యాలు ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు. సుప్రీం కోర్టు తీర్పును కూడా బేఖాతరు చేస్తున్నాయని పేర్కొన్నారు. 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్ జీవోలను ప్రభుత్వం ఎందుకు సవరించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కార్మిక వర్గ పోరాటాలతోనే తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
టీయూసీఐ జిల్లా అధ్యక్షులు తోకల రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్, ఉపాధ్యక్షులు గొల్లపల్లి చంద్రయ్య, ఆడెపు శంకర్, మార్త రాములు, గూడూరి వైకుంఠం, కల్వల రాయమల్లు, నాగభూషణం, తూళ్ల శంకర్, చిలుక రాజు, మాటేటి పోశం, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.