Sahara Victims | వేములవాడ, ఏప్రిల్ 27: సహారా బాధితుల కోసం ప్రత్యక్ష న్యాయ పోరాటాలకు దిగుతామని జిల్లా సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యురాలు జవ్వాజి విమల అన్నారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని సహారా ఏజెంట్లతో కలిసి ఆమె సోమవారం సమావేశమై మాట్లాడారు. అనేకమంది నిరుపేదలు దాచుకున్న డబ్బును కేంద్రంలోని హోంమంత్రి అమిత్ షా తన వద్ద సహారా ఆస్తులను పెట్టుకొని జాప్యం చేస్తున్నాడని ఆరోపించారు.
కోట్లాది రూపాయలను వెంటనే సహారా బాధితులకు అందజేయాలని ఆమె డిమాండ్ చేశారు. త్వరలోనే సహారా బాధితుల కోసం ప్రత్యక్ష పోరాటానికి సంబంధించిన కార్యాచరణ ప్రకటించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సహారా ఏజెంట్లు ప్రవీణ్, రామ్ లింగేష్, మంజుల, శ్రీరాములు, బాలయ్య తదితరులు ఉన్నారు.