Ramagundam | కోల్ సిటీ, జూలై 19 : రామగుండం మున్సిపాలిటీలో ప్రజాస్వామ్య విలువలకు చోటు లేదని, అందులో ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లు అంటే మరీ లెక్కలేదని, కరివేపాకులా తీసిపారేస్తున్నరని 51వ డివిజన్ మహిళా కార్పొరేటర్ ఆకరపు రేఖ మహేస్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతా ఎమ్మెల్యే చెప్పినట్టే నడవాలంటే ఇక మున్సిపల్ ఎన్నికలు ఎందుకు పెట్టారని, ఎన్నాళ్లీ నియంత పాలన అంటూ తమకు ఓపిక నశించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక న్యాయ పోరాటంతోనే తేల్చుకుంటానని, త్వరలోనే మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్ల అక్రమాలను సాక్ష్యాలతో బయటపెడుతా..’ అంటూ రేఖ మహేష్ స్పష్టం చేశారు. ఈమేరకు ఆమె ఆమె మున్సిపల్ అధికారుల తీరుపై ఆదివారం బహిరంగ సవాల్ చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 51వ డివిజన్ లో గత ఆరు నెలలుగా అధికారిక కార్యక్రమాల సమాచారం ఇవ్వకుండా అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
లక్ష్మీనగర్ లో రోడ్డు వెడల్పు పేరుతో ఇళ్లను కూల్చడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనకు సమాచారం లేకుండా 51 డివిజన్ లో కూల్చివేతలు జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజాధనంతో చేపట్టే ప్రతి పనిలో పారదర్శకత ఉండాలనీ, అవసరమైతే చట్టపరంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తనకు సమాచారం లేకుండా డివిజన్ లో సందర్శించడం, ఇతర డివిజన్ల కార్పొరేటర్లు వచ్చి ఇక్కడ ఆజమాయిషీ చేయడం, 51వ డివిజన్ లో జరగుతున్న పనుల గురించి కాంట్రాక్టర్ ను అడిగితే ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లి అడుగు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారనీ, పైగా నాసిరకం పనులు చేస్తున్నారని, ఈ విషయమై మేయర్ దృష్టికి తీసుకవెళ్తే లక్ష్మీనగర్ అందరిదని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారనీ, అలాంటప్పుడు లక్ష్మీనగర్ డివిజన్ కు ఎందుకు ఎన్నికలు నిర్వహించారని ప్రశ్నించారు.
అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతున్నా చర్యలు తీసుకునే పరిస్థితి లేకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల నుంచే తిరుగుబాటు మొదలైందంటే కార్పొరేషన్లో పరిస్థితి ఏవిధంగా ఉందో ప్రజలు గమనించాలని కోరారు. ఈ నియంత ధోరణిపై తన డివిజన్ నుంచే న్యాయ పోరాటం ప్రారంభిస్తానని స్పష్టం చేశారు.