Sarangapur | సారంగాపూర్, డిసెంబర్ 5: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సారంగాపూర్ ఎస్సై గీత పేర్కొన్నారు. మండలంలోని రేచపల్లి గ్రామంలో యువత, అభ్యర్థులు, గ్రామస్తులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లోని అర్హులైన యువతీ, యువకులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు నియమావళికి అనుగుణంగా నడుచుకోవాలని, ఎన్నికల నియమావళిని అతిక్రమించి ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో ప్రజాస్వామ్య బద్దంగా ప్రతిఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, సర్పంచ్ పదవులకు గ్రామాల్లో వేలం నిర్వహించడం గానీ, అభివృద్ధి పనుల పేరుతో ఏకగ్రీవాలు చేయడం గానీ చేసినట్లయితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
కుల, మత వర్గాలను రెచ్చగొట్టే విధంగా ప్రచారం నిర్వహించరాదని, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు ఎన్నికల నియమావళిని పాటిస్తూ ఓటర్లను మభ్యపెట్టకుండా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగేలా ప్రతిఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్స్ ఆంజనేయులు, విజయ్ కుమార్, అభ్యర్ధులు, యువత, తదితరులు పాల్గొన్నారు.