వెల్గటూర్, మార్చి 23 : సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్‌గా నిలుస్తున్నదని, రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరెక్కడ లేవని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని రాజారాంపల్లిలో బీరయ్య పట్నాల సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా గొల్లకుర్మలు మంత్రికి గొంగడి, గొర్రె పిల్లను బహుకరించారు. అనంతరం రాంనూర్- చెగ్యాం గ్రామాల మధ్య రూ.4 కోట్లతో చేపట్టిన హైలెవల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాంనూర్‌లో 53 మంది ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్వాసితులకు 2 లక్షల చొప్పున పరిహారం, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 13 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులను జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కలెక్టర్ రవితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడ లేవని, వాటి అమలులో మనమే దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. మన పథకాలను అనుసరించేందుకు వివిధ రాష్ర్టాల నుంచి ప్రతినిధులు వచ్చి అమలు తీరును తెలుసుకుంటున్నారన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లోని కొన్ని గ్రామాల ప్రజలు తమను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేశారు. జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ఎన్నికల్లో మంచి వ్యక్తులను ఎన్నుకుంటే మంచి పనులు చేస్తారని, మన మంత్రి ఈశ్వర్ అన్న నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తని, ఇలాంటి వారితో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు. అనంతరం కోటిలంగాలలో పర్యాటక శాఖ ఆద్వర్యంలో చెపట్టే అభివృద్ధి కార్యక్రమాలు వివరాలను వారంలో నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కునమల్ల లక్ష్మి, ఆర్డీవో మాధురి, తహసీల్దార్ రమేశ్, సర్పంచ్‌లు బోడుక మంజుల, ద్యావనపల్లి లక్ష్మి, తిరుపతి, గంగుల నగేశ్, నాయకులు గూడ రాంరెడ్డి, పత్తిపాక వెంకటేశ్, జుపాక కుమార్, గుండా జగదీశ్వర్ గౌడ్, మూగల సత్యం, మెతుకు స్వామి, పెద్దూరి భరత్, రంగు తిరుపతి, బిడారి తిరుపతి, పడిదం మొగిళి, రవి తదితరులు ఉన్నారు.