Collector Chitra Mishra | చిగురుమామిడి, సెప్టెంబర్ 18 : భూముల రీ సర్వే రైతులకు ముందస్తు సమాచారం అందించి వారి సమక్షంలోనే సర్వే చేపట్టారని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూముల సర్వేను ఆర్డీవో షర్మిలతో కలిసి శుక్రవారం పరిశీలించారు. రీ సర్వేతో భూముల సమస్యలను పరిష్కారం లభిస్తుందని సర్వే ముందు సంబంధిత రైతులకు సమాచారమందించి వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలన్నారు. సాంకేతిక పరికరాలతో సర్వే చేస్తున్నందున హద్దుల వివరాలు నమోదులో పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామంలో రెండు బృందాలు రీ సర్వే చేస్తున్నామని ఇప్పటివరకు 605 ఎకరాలు సర్వే చేసినట్లు తహసీల్దార్ కోడం కనకయ్య కలెక్టర్ కు వివరించారు.
ఆయిల్ ఫామ్ నర్సరీ ఏర్పాట్లకు కలెక్టర్ స్థల పరిశీలన
ఆయిల్ ఫామ్ నర్సరీ ఏర్పాటుకు ఉల్లంపల్లిలోని ఓదెల మల్లన్న గుట్ట వద్ద ప్రభుత్వ భూమిని కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు. ప్రభుత్వ భూముల వివరాలను తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గనుకుల పల్లె చిగురుమామిడి రోడ్డు మార్గం పరిశీలించారు. చిగురుమామిడి మండల కేంద్రానికి సులువుగా ఉండే రహదారికి నిధులు మంజూరయ్యాయని ప్రక్రియ టెండర్ దశలో ఉందన్నారు. ఇందుర్తి, ఓగులాపూర్, గాగిరెడ్డిపల్లి గ్రామాలకు ఈ రహదారి మండల కేంద్రానికి దగ్గరగా అవుతుందన్నారు. ప్రజలకు దూర భారం తగ్గించేందుకు పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో షర్మిల, తహసీల్దార్ కోడం కనకయ్య, పంచాయతీరాజ్ ఏఈ నిరంజన్ రెడ్డి, సర్పంచులు అలువాల శంకర్, గుణుకుల మధుసూదన్ రెడ్డి, డీపీఆర్వో జనార్ధన్ పాల్గొన్నారు.