Land issues | పెద్దపల్లి, జూలై 26 : భూభారతి రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై స్వీకరించిన ప్రతీ దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసి, వచ్చే నెల 15 నాటికి పూర్తి స్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి కలెక్టర్ రెవెన్యూ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. భూ సమస్యల దరఖాస్తుల డిస్పోజల్ చాలా నెమ్మదిగా జరుగుతుందని, వేగం పెంచాలని సూచించారు.
సాదా బైనామా దరఖాస్తులు కూడా వెరిఫికేషన్ చేసి పెట్టుకోవాలని, హై కోర్టు నుంచి అనుమతి రాగానే సదరు దరఖాస్తుల పరిష్కరించేందుకు సిద్దంగా ఉండాలన్నారు. భూ భారతి దరఖాస్తులను పూర్తి స్థాయిలో డిస్పోజ్ చేయాలని, ఇక నుంచి జిల్లాలో రెవెన్యూ సిబ్బంది సెలవు రోజుల్లో కూడా పని చేయాలని ఆదేశించారు. తిరస్కరించే ప్రతీ దరఖాస్తుకు ఖచ్చితమైన కారణం ఉండాలని, సదరు వివరాలు దరఖాస్తుదారుడికి సమర్పించాలన్నారు. సమావేశంలో పెద్దపల్లి, మంథని ఆర్డీవోలు బీ గంగయ్య, కే సురేష్, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.