జగిత్యాల జిల్లాకేంద్రంలో భూముల కబ్జా రోజుకో కొత్త రూపం దాల్చుతున్నది. ఖాళీ జాగ కనిపిస్తే చాలు.. చెరపట్టేందుకు తెగబడుతుండడం కలకలం రేపుతున్నది. ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్ ఇబ్బందికరంగా ఉంటుందని.. అందులో షెడ్లు, లేదా పెంకుటిండ్లు ఉన్నట్టు రికార్డులు క్రియేట్ చేయడం, మున్సిపాలిటీలో అసెస్మెంట్ పత్రాలు సంపాదించడం, తప్పుడు ఇంటి నంబర్లను సృష్టించడం, వాటి ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవడం సంచలనం కలిగిస్తున్నది. తాజాగా ఇలాంటి బాగోతమే వెలుగులోకి వచ్చింది. తాను నలభై ఆరేళ్ల క్రితం కొన్న భూమిని తప్పుడు పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ చేశారంటూ ఓ బాధితుడు మూడు రోజుల క్రితం కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం ఎన్నో అనుమానాలకు తావిస్తున్నది.
జగిత్యాల, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : జగిత్యాల రూరల్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన కోరెపు గంగారం 1980 జూన్ 4న జగిత్యాల వాసి ముష్కరి లక్ష్మణ్‌కు చెందిన కృష్ణానగర్‌లోని సర్వే నంబర్ 414లో నాలుగు గుంటల భూమిని కొనుగోలు చేశాడు. ఈ మేరకు జగిత్యాల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 1491/1980 నంబర్‌తో రిజిస్ట్రేషన్ అయింది. అప్పటి నుంచి ఈ భూమి గంగారాం ఆధీనంలోనే ఉన్నది. అయితే 2002లో గంగారాం తన 4 గుంటల భూమి నుంచి రెండు గుంటలను చెల్లెలు ఎనగంటి సత్యవతికి గిఫ్ట్ డీడ్ చేశాడు. ఈ గిఫ్ట్ డీడ్ సైతం జగిత్యాల రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే చేశాడు. తన రెండు గుంటల భూమిలో ఇంటి నిర్మాణం చేపట్టకుండా అలాగే ఖాళీగా ఉంచేశాడు. అయితే గంగారాం చెల్లె సత్యవతి తన అన్న బహుమతిగా ఇచ్చిన రెండు గుంటల స్థలంలో ఇటీవల ఇంటి నిర్మాణం చేపట్టింది. ఓ రోజు గంగారాం అక్కడికి వెళ్లిన సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి.. గంగారంకు సంబంధించిన రెండు గుంటల భూమి తమదేనని, తాము కొన్నామని చెప్పడంతో బిత్తరపోయాడు.
నలభై ఆరేళ్ల క్రితం తాను భూమిని కొన్నానని తానెవ్వరికి విక్రయించలేదని స్పష్టం చేయడంతో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. తర్వాత అనుమానం వచ్చిన గంగారం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి విచారించడంతో అసలు విషయం బయపడింది. ఈ ఏడాది జనవరి 9న ముష్కరి సురేశ్ అనే వ్యక్తి సర్వే నంబర్ 414లోని 144 గజాల స్థలంలో ఉన్న షెడ్డుతో కూడిన స్థలాన్ని కుసుమ వినయ్ అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసినట్టు తేలింది. ఈ రిజిస్ట్రేషన్‌కు బోరగళ్ల గంగారాజం, బొమ్మకంటి నాగరాజు సాక్షులుగా ఉన్నారు. ఈ రికార్డులను చూసి ఆందోళన చెందిన గంగారం.. రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందని లోతుగా పరిశీలిస్తే తీస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. 144 గజాల స్థలంలో ఇంటి నంబర్ 1-2-265/ఏతో షెడ్డు ఉన్నట్టు, ఇక దీనికి మున్సిపల్ అసెస్మెంట్ నంబర్ 1101025284గా పేర్కొన్నారు. ఈ రెండు నంబర్ల ఆధారంగా జగిత్యాల సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ చేశారు. మళ్లీ నెల తర్వాత ఇంటి నంబర్, అసెస్మెంట్ నంబర్ తప్పుగా నమోదైందంటూ ఫిబ్రవరి 10న సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రెక్టిఫికేషన్ చేయించారు. జనవరి 9న రిజిస్ట్రేషన్ సమయంలో ఇంటి నంబర్‌ను, అసెస్మెంట్ నంబర్‌ను తప్పుగా పేర్కొన్నామని, వాస్తవానికి తమ ఇంటి నంబర్ 1-1-కేఆర్0002 అని, అసెస్మెంట్ నంబర్ 1101020804 అని పేర్కొంటూ రిక్టెఫికేషన్ను పూర్తి చేసుకున్నారు.
రిజిస్ట్రేషన్ డ్యాకుమెంట్ల ఆధారంగా మున్సిపల్ కార్యాలయంలోనూ, క్షేత్రస్థాయిలోనూ పరిశీలిస్తే బిత్తరపోయే నిజాలు వెలుగుచూశాయి. 414 సర్వే నంబర్లో అసలు ఇప్పటి వరకు షెడ్డు నిర్మాణమే లేదు. అది ఇంకా ఖాళీగానే ఉన్నది. ఈ ఏడాది జనవరి9న జరిపిన రిజిస్ట్రేషన్‌లో పేర్కొన్న ఇంటి నంబర్ 1-2-265/ఏ రికార్డును మున్సిపల్ ఆఫీస్‌లో పరిశీలిస్తే.. మహాలక్ష్మినగర్‌లోని డీ రాజశేఖర్ అనే యజమానికి సంబంధించినట్టు చూపిస్తున్నది. అలాగే ఆ ఇంటికి అసెస్మెంట్ నంబర్ 1101008657గా ఉన్నది. ఫిబ్రవరి 10న చేసిన రెక్టిఫికేషన్ రికార్డులో పేర్కొన్న 1-1-కేఆర్0002 ఇంటి నంబర్ అసలు రికార్డుల్లోనే లేదు. జనవరి 9న చూపిన అసెస్మెంట్ నంబర్ 1101025284, ఫిబ్రవరి 10న పేర్కొన్న నంబర్ 1101020804 నాట్‌ఫౌండ్ అని చూపెడుతున్నాయి. గంగారం కొనుగోలు చేసిన స్థలం కృష్ణానగర్‌లో ఉండగా, రిజిస్ట్రేషన్, రెక్టిఫికేషన్ డ్యాకుమెంట్లలో పేర్కొన్న ఇంటి నంబర్ కృష్ణానగర్‌కు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాలక్ష్మినగర్‌లో ఉండడం అందరినీ విస్మయానికి గురిచేస్తున్నది. అన్నింటికంటే ఆశ్చర్యం ఏమిటంటే.. లేని ఇంటిని సృష్టించి, ఫొటోను రిజిస్ట్రేషన్ డ్యాకుమెంట్లకు జత చేయడం! మొత్తంగా ఈ వ్యవహారం ఎన్నో అనుమానాలకు తావిస్తున్నది.

భూమి రిజిస్ట్రేషన్ విషయమై జగిత్యాల సబ్ రిజిస్ట్రేషన్ అధికారి (ఎస్ఆర్వో) సుజాతను వివరణ కోరగా, జనవరి 9న రిజిస్ట్రేషన్, ఫిబ్రవరి 10న రెక్టిఫికేషన్ జరిగిన మాట వాస్తవమేనన్నారు. ఇంటి నంబర్, అసెస్మెంట్ నంబర్ల ఆధారంగానే తాము రిజిస్ట్రేషన్ చేశామని చెప్పారు. ఇంటి నంబర్ తప్పుగా ఉందని, అసెస్మెంట్ నంబర్ ఆన్లైన్లో చూపించడం లేదని, ఎలా రిజిస్ట్రేషన్ చేశారని ప్రశ్నించగా.. రిజిస్ట్రేషన్, రెక్టిఫికేషన్ సమయంలో ఆన్లైన్లో చూపించాయని, అందుకే రిజిస్ట్రేషన్ చేశామన్నారు. ఇప్పుడు చూపించడం లేదని, దానికి మాకు ఏం సంబంధం లేదన్నారు. గంగారాం రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే, రిజిస్ట్రేషన్ చేసిన వారికి, కొనుగోలుదారులకు నోటీసులు ఇచ్చి పరిశీలన చేస్తామన్నారు.
నలభై ఆరేళ్ల క్రితం కొన్న తన భూమిని తనకు దక్కేలా చేయాలంటూ అధికారులను కోరెపు గంగారాం వేడుకుంటున్నాడు. సోమవారం జగిత్యాల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. అలాగే సబ్ రిజిస్ట్రేషన్, మున్సిపల్ అధికారులకు వినతిపత్రం ఇచ్చాడు. ‘నమస్తే తెలంగాణ’తో తన గోడు వెల్లబోసుకున్నాడు. ‘సార్ నన్ను పూర్తిగా ముంచుతున్నరు. నాకు న్యాయం జరిగేలా చూడండి. నేనే కాదు, నాలా చాలా మంది తప్పుడు రిజిస్ట్రేషన్లతో మునిగిపోతున్నరు’ అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.
అసెస్మెంట్ తప్పుడు నంబర్లు, తప్పుడు ఇంటి నంబర్‌తో రిజిస్ట్రేషన్ జరగడంపై జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందనను వివరణ కోరగా, ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. రికార్డులన్నింటినీ పరిశీలించిన తర్వాతే వివరాలు చెప్పగలమని స్పష్టం చేశారు.