దేశానికి వెలుగులు పంచే సింగరేణి విస్తరణ కోసం సర్వంధారబోసిన నిర్వాసిత కుటుంబాల్లో అంధకారం అలుముకుంటున్నది. భూ సేకరణ అధికారుల ఇష్టారాజ్యం.. సర్కారు పట్టింపులేమితో తీవ్ర అన్యాయం జరుగుతున్నది. పదకొండేండ్లుగా పరిహారం కోసం ఎదురుచూస్తూ ప్రయాస పడుతున్న రామగిరి మండలం బుధవారంపేట రైతులను యంత్రాంగం నిండా ముంచుతున్నది. కోర్టు తీర్పు ఉన్నా పెడచెవిన పెట్టి, ఎంజాయ్మెంట్ సర్వే చేయడమేకాదు 88ఎకరాల 20 గుంటలు సేకరించి, భూమి లేని వ్యక్తుల పేరిట అవార్డు పాస్ చేసి అసలైన లబ్ధిదారులకు కుచ్చుటోపి పెడుతున్నారని, అనేక అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. బాధితులు న్యాయం కోసం కార్యాలయాల చూట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పెద్దపల్లి, సెప్టెంబర్ 6(నమస్తే తెలంగాణ): సింగరేణి ఆర్జీ-3 ఏరియా ఓసీపీ-2 విస్తరణలో భాగంగా భూసేకరణ ఇష్టా రాజ్యంగా నడుస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. భూమిలేని వారి పేరు మీద అవార్డు పాస్ చేస్తూ, అసలైన భూ నిర్వాసితులకు అన్యాయం చేస్తూ అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఓసీపీ-2 విస్తరణలో భాగంగా రామగిరి మండ లం బుధవారంపేట శివారులో భూము లు అవసరమని ఉమ్మడి రాష్ట్రంలో అప్ప టి ప్రభుత్వానికి సింగరేణి సంస్థ దరఖా స్తు చేసుకున్నది.
దీంతో ప్రభుత్వం 2011 లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్, 2012లో డ్రాఫ్ట్ డిక్లరేషన్‌ను జారీ చేసింది. 2015లో 708 ఎకరాల 16 గుంటల భూమికి అవార్డు పాస్ చేయగా, 2016లో భూ రికార్డుల్లో రెవెన్యూ అధికారులు సింగరేణి కంపెనీ లిమిటెడ్ పేరును యజమానిగా రికార్డ్ చేశారు. కానీ రైతులకు నష్టపరిహారం చెల్లించలేదు. ఈ విషయంపై కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించగా, 2022లో ఆ భూ సేకరణ అవార్డును రద్దు చేస్తూ, వాస్తవ రైతులందరి పేర్లను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసి, పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
హైకోర్టు తీర్పును సైతం పకకు పెట్టి అందులోని 88ఎకరాల 20ఎకరాల భూసేకరణకు 2024 మార్చి 14న ప్రిలిమినరీ నోటిఫికేషన్, 2024 జూన్ 23న పబ్లికేషన్ ఆప్ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ సర్కారు జారీ చేసింది. హైకోర్టు తీర్పు ప్రకారం కొత్త పట్టా పాసు బుకులు ఇచ్చిన తర్వాత భూసేకరణ చేపట్టాలని, అప్పటి వరకు భూ సేకరణ చేసేది లేదని గ్రామ సభలో చెప్పినప్పటికీ, అధికారులు పట్టించుకోకుండా భూమి లేని వారి పేరిట పోలీస్ రక్షణ మధ్య ఎంజాయ్మెంట్ సర్వే చేసి, అవార్డు పాస్ చేశారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, మంత్రి శ్రీధర్‌బాబు చొరవ చూపి భూ సేకరణపై సమగ్ర విచారణ జరిపించి అసలైన నిర్వాసితులకు నష్టపరిహారం ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
బుధవారంపేట శివారులోని సర్వే నంబర్ 204లో వేల్పుల మల్లీశ్వరి నుంచి 242 చదరపు గజాలు కొనుగోలు చేసి 2009 జూలై 17న రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాం. మ్యుటేషన్ చేయించుకున్నా. ఇల్లు కూడా కట్టాను. ఓసీపీ-2 విస్తరణలో భాగంగా 2024 మార్చి 14న ప్రిలిమినరీ నోటిఫికేషన్, 2024 జూన్ 23న పబ్లికేషన్ ఆప్ డిక్లరేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. అందులో నా పేరు కూడా ఉంది. కానీ నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎంజాయ్ మెంట్ సర్వే చేసి, నా పేరును ఎగరగొట్టి భూమి లేని వ్యక్తి పేరు మీద అవార్డు పాస్ చేశారు. ఈ ఇదేంటని అధికారులను అడిగితే.. మేం ఇలాగే చేస్తాం.. అవసరమైతే కోర్టుకు వెళ్లమని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నరు.
– పోలుదాసరి వెంకటేశం, భూ నిర్వాసితుడు, యైటింక్లయిన్‌కాలనీ
బుధవారంపేట భూసేకరణలో చాలా అవకతవకలు జరిగాయి. పీఎన్, పీడీ నోటిఫికేషన్లలో వచ్చిన పేర్లు ఎంజాయ్ మెంట్ అవార్డుల్లో మాయం కావడంలోని ఆంతర్యం ఏమిటి..?. భూ నిర్వాసితులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోలీస్ పహరా నడుమ ఎంజాయ్ మెంట్ సర్వే చేసి, భూమి లేని వ్యక్తి పేరు మీద అవార్డు చేశారు. ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంది. పీఎన్, పీడీ నోటిపికేషన్లో నా పేరు ఉందని, నాకు నష్టపరిహారం రాలేదని చెప్పినా సింగరేణి అధికారులు పట్టించుకోకుండా కాలువ తవ్వారు.
– పురుషోత్తం, భూ నిర్వాసితుడు, యైటింక్లయిన్‌కాలనీ