స్మార్ట్‌సిటీ కరీంనగర్‌కు కేంద్రంతోపాటు బీఆర్ఎస్ సర్కారు నిధుల వరద పారించింది. వందల కోట్లతో అభివృద్ధి పనులు చేయించింది. అయితే కాంట్రాక్టర్ల కక్కుర్తి, అధికారుల పర్యవేక్షణా లోపం ప్రగతికి నిరోధంలా మారింది. పనుల్లో నాణ్యతాలోపంతో అధ్వానంగా మారాయి. రోడ్లు రెండేళ్లకే పగుళ్లు చూపుతున్నాయి. పుట్‌పాత్, మల్టీపర్పస్ పార్కింగ్ టైల్స్ పగిలిపోతున్నాయి. కొన్నిచోట్ల కుంగిపోయి నడవడానికి వీలు లేకుండా తయారయ్యాయి. పది కాలాలపాటు నిలువాల్సిన పనులు ఇంత తొందరగా మరమ్మతులకు చేరడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా చేపట్టే పనులు నాణ్యతతో చేయాలని, ఆ మేరకు అధికారులు పర్యవేక్షణ పెంచాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్ కార్పొరేషన్, అక్టోబర్ 3 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ సర్కారు కరీంనగర్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోనే రెండో నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్లింది. మరోవైపు స్మార్ట్‌సిటీ జాబితాలో రాష్ట్రం నుంచి కరీంనగర్‌ను చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సఫలీకృతమైంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు స్మార్ట్‌సిటీలో నగరం ఎంపికైన తర్వాత కేంద్రంతోపాటు భారీగా నిధుల వరద పారించింది.
వందల కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేయించింది. అందులో ప్రధానంగా దాదాపు 370 కోట్లతో ప్రధాన రహదారులతోపాటు లింకు రోడ్లను డెవలప్ చేశారు. వీటితోపాటు ఇరువైపులా మల్టీపర్పస్ పార్కింగ్, ఫుట్‌పాత్‌లు నిర్మించారు. అయితే, కాంట్రాక్టర్ల కక్కుర్తి, అధికారుల పర్యవేక్షణ లోపం శాపంలా మారింది. పనులపై ఎప్పటికప్పుడు నిఘా లేకపోవడంతో నాణ్యత కొరవడింది. ఫలితంగా రోడ్లు, ఫుట్‌పాత్‌లు దెబ్బతిన్నాయి. జగిత్యాల రోడ్డు, లేబర్ అడ్డా రోడ్డు, విద్యానగర్, యూనివర్సిటీ రోడ్డు, కట్టరాంపూర్ రోడ్డు, భగత్‌నగర్ రోడ్డు, గాంధీ రోడ్డు ఇలా అన్ని ప్రాంతాల్లోని ఫుట్‌పాత్‌లు అప్పుడే మరమ్మతులకు చేరాయి.
కొన్ని ప్రాంతాల్లో ఆయా వ్యాపార సంస్థల వల్ల చెడిపోగా.. అనేక ప్రాంతాల్లో టైల్స్ పగిలిపోయి, గుంతలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఫుట్‌పాత్, పార్కింగ్ ప్రాంతాల్లో టైల్స్ వేసే సమయంలో కింద సరిగా లెవల్ చేయకపోవడం వల్లే టైల్స్ అన్నీ దెబ్బతిన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్ అధికారులు ఈ పనులను పర్యవేక్షించకపోవడంతోనే కాంట్రాక్టర్లు నాణ్యత లేకుండా పనులు చేశారన్న ఫిర్యాదులు ఉన్నాయి.
వేసిన రెండు, మూడేళ్లకే ఫుట్‌పాత్‌లు, పార్కింగ్ ప్రాంతాల పరిస్థితి ఇలా ఉండగా.. మరి కొన్ని ప్రాంతాల్లో రోడ్లలోనూ పగళ్లు వచ్చాయి. అనేక ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ల్లో ఏర్పాటు చేసిన చాంబర్స్ పైకప్పులు కనిపించకుండా పోయాయి. అధికారులు అప్పుడే పక్కాగా పర్యవేక్షణ చేసుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా కాంట్రాక్టర్‌తో మరమ్మతులు చేయించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. పనులను నాణ్యతతో చేయించాలని, ఆ మేరకు అధికారులు పర్యవేక్షించాలని కోరుతున్నారు.
రెండేళ్ల నిర్వహణ కాంట్రాక్టర్‌దే
స్మార్ట్‌సిటీ కింద చేపట్టిన రోడ్లను మున్సిపాలిటీ తీసుకున్న తర్వాత రెండేళ్ల వరకు కాంట్రాక్టర్ నిర్వహణ చేయాలి. ఏయే రోడ్డు ఎప్పుడు తీసుకున్నామని ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించి, చెడిపోయిన ప్రాంతాల్లో మరమ్మతులు చేయించాలి. కొన్ని ప్రాంతాల్లో యజమానుల వల్ల కూడా ఫుట్‌పాత్‌లు దెబ్బతిన్నాయి. ఎక్కడ చెడిపోయినా దానికి బాధ్యులు ఎవరో గుర్తించి మళ్లీ మరమ్మతులు చేయించేలా ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించాలని అధికారులకు సూచనలు చేశాం.
– యాదగిరి సునీల్‌రావు, మేయర్ (కరీంనగర్)
మరమ్మతుల కోసం ఆదేశాలు ఇచ్చాం
నగరంలో ఫుట్‌పాత్‌లు, మల్టీపర్పస్ పార్కింగ్ స్థలాల్లో ఇబ్బందులు మా దృష్టికి కూడా వచ్చాయి. వాటికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించాలని ఇప్పటికే కాంట్రాక్టర్‌కు ఆదేశాలు ఇచ్చాం. స్మార్ట్‌సిటీ రోడ్లన్నింటిల్లోనూ దెబ్బతిన్న వాటిని మరమ్మతు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. పలు ప్రాంతాల్లో భారీ వాహనాలు రావడం, కొన్ని ప్రాంతాల్లో యజమానులు చేపట్టిన పనుల మూలంగా టైల్స్ దెబ్బతిన్నాయి. వీటిని కూడా గుర్తించి చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచనలు చేశాం.
– చాహత్ బాజ్‌పాయ్, నగరపాలకసంస్థ కమిషనర్