కరీంనగర్ బస్టేషన్లో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సంస్థ నిర్లక్ష్యం, అధికారుల పట్టింపులేమితో ప్రయాణికులకు రక్షణ కరువవుతున్నది. రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద స్టేషన్లో నిర్వహణ సరిగ్గా లేక కొన్ని నెలలుగా దొంగతనాలు పెరుగుతున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది కొరత, సీసీ కెమెరాలు అంతంతే ఉండడం, కొద్దిరోజుల క్రితం కమాండ్ కంట్రోల్ డెస్క్ ఎత్తేయడం అందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి.
కరీంనగర్ తెలంగాణ చౌక్, సెప్టెంబర్ 5: కరీంనగర్ బస్టేషన్ రాష్ట్రంలోనే రెండో అతి పెద్దది. ఇక్కడ 49 ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. కరీంనగర్ రీజియన్‌తోపాటు వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్ రీజియన్ పరిధిలోని 20 డిపోలకు చెందిన 1850 బస్సులు నిత్యం లక్ష మంది ప్రయాణికులను రాష్ట్ర నలుమూలలకు చేరవేస్తుంటాయి. అయితే ఈ బస్టేషన్, కొన్ని నెలలుగా భద్రతాలోపంతో సతమతమవుతున్నది.
గతేడాది డిసెంబర్ ముందు వరకు ఇక్కడి నుంచి ప్రతి రోజూ 60వేల మంది ప్రయాణించినా.. కాంగ్రెస్ సర్కారు మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగింది. అయితే ఇదే అదనుగా దొంగలు రెచ్చిపోతున్నారు. బ్యాగ్‌లు, బంగారు గొలుసులు, సెల్ ఫోన్లను కొట్టేస్తున్నారు. ఆగస్టు ఒక్క నెలలోనే 15 దొంగతనాలు జరగడం పరిస్థితికి అద్దంపడుతున్నది.
Karimnagar5
కమాండ్ కంట్రోల్ డెస్క్, సెక్యూరిటీ సిబ్బంది ఎక్కడ?
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయాణికుల భద్రతకు అనేక చర్యలు తీసుకున్నది. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా బస్టేషన్లో 46 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వన్ టౌన్‌కు చెందిన ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుల్స్‌తో బస్టాండ్ ఆవరణలో కమాండ్ కంట్రోల్ పోలీసు హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయగా, వారు మూడు షిఫ్ట్‌ల్లో 24 గంటల పాటు పర్యవేక్షించేవారు. అయితే ఆరు నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో అదే సమయంలోనే హెల్ప్ డెస్క్‌ను ఎత్తేశారు.
పోలీసులను ఇతర విధులకు కేటాయించారు. అయితే గత నెలో సీసీ కెమెరాలు మరమ్మతులు చేయించినప్పటికీ రద్దీ పెరగడంతో నిఘాకు సరిపోవడం లేదు. సుమారు 88 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే భద్రత పటిష్టంగా ఉంటుందని సెక్యూరిటీ అధికారులు చెబుతున్నారు.
ఇదే టైంలో సెక్యూరిటీ సిబ్బంది నియామకం సైతం పూర్తిస్థాయిలో లేకపోవడం మరో కారణంగా కనిపిస్తున్నది. షిఫ్ట్‌కు పది మంది పని చేయాల్సి ఉండగా కేవలం ఏడుగురు మాత్రమే పనిచేస్తున్నారు. ఇప్పటికైనా డిపో అధికారులు స్పందించి, బస్టేషన్లో సీసీ కెమెరాల సంఖ్యను పెంచాలని, సరిపడా సెక్యూరిటీ సిబ్బందిని నియమించి, ప్రత్యేక పోలీసు ఔట్‌పోస్టును సైతం ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.