Marrigaddapalle | చందుర్తి, మే 23 : చందుర్తి మండలం మర్రిగడ్డ పల్లె దవాఖానాలో మౌలిక వసతులు కరువయ్యాయి. నిత్యం ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తూ అందుబాటులో ఉండే పల్లె దవాఖానాలో నీటి కరువు ఏర్పడింది. కనీసం బోరుబావి మోటార్ లేకపోవడంతో చుట్టుపక్కల పంట పొలాల్లోంచి బకెట్లతో నీటిని తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది.
రోగులకు ప్రథమ చికిత్స చేయాల్సిన ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు బకెట్లతో నీటిని తీసుకురావడంతో మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రోజు చుట్టుపక్కల ఉన్న బోరు బావుల నుంచి నీటిని తెస్తూ వారు ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు. బాత్రూం, ల్యాబ్ లో నీటి సౌకర్యం లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రాత్రి వేళలో ఆకతాయిలు దవఖాన పరిసరాల్లో మద్యం సేవించి సీసాలను పగలగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల స్పందించి దవాఖానాలో బోరు మోటర్ ఏర్పాటు చేసి మౌలిక వసతులతో పాటు మరమ్మతులు చేయాలని పలువురు కోరుతున్నారు.